మంత్రి పదవి నుంచి తనను బర్తరఫ్ చేయాలన్న భారతీయ జనతా పార్టీ చేసిన డిమాండ్‌పై మంత్రి కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పదిమందిని వెంటబెట్టుకుని అమిత్‌షాను తొలగించాలని డిమాండ్ చేస్తే తొలగిస్తారా? అని ప్రశ్నించారు. ఎవరి పార్టీ వ్యవహారాలు వాళ్లు చూసుకుంటే మంచిదని హితవు పలికారు. గత ఎన్నికల్లో నోటా కన్నా తక్కువ వచ్చిన భాజపా... అత్యధిక ఓట్లు వచ్చిన జగన్‌కు సలహాలు ఇచ్చే స్థాయిలో ఉందా అని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో కన్నా మెరుగైన ఓట్లు సాధించేందుకు ప్రయత్నించండని భాజపాకు సూచించారు.
యూపీ సీఎం, ప్రధాని ఆలయాలకు ఒంటరిగా వెళ్లొచ్చా?
కుటుంబసమేతంగా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించాలని ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్‌పై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ తన భార్యతో వెళ్లి రామాలయంలో పూజలు చేశారా? అని ప్రశ్నించారు. యూపీ సీఎం, ప్రధాని మాత్రం ఒంటరిగా ఆలయాలకు వస్తారని, జగన్ మాత్రం కుటుంబసమేతంగా ఆలయానికి రావాలా అని నిలదీశారు. కుటుంబ సమేతంగా పూజలు చేయాలని ఏ శాస్త్రంలో చెప్పారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
డిక్లరేషన్ తీసేయాలి : కొడాలి నాని
తిరుమల డిక్లరేషన్‌పై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని మంత్రి కొడాలి నాని స్పష్టంచేశారు. శ్రీవారిపై నమ్మకంతోనే దేశవిదేశాల నుంచి భక్తులు వస్తున్నారని, నమ్మకం లేకపోతే కొండపైకి ఎవరు రారని అభిప్రాయపడ్డారు. అసలు డిక్లరేషన్ ఎప్పుడు, ఎందుకు పెట్టారనే అంశంపై చర్చజరగాలన్న ఆయన.. డిక్లరేషన్ తీసేయాలని పునరుద్ఘాటించారు.
ఇదీ చదవండి : 'శ్రీవారిని దర్శించుకునే ముందు జగన్ డిక్లరేషన్‌పై సంతకం చేయాలి'