మధురమైన తెలుగు భాషను భావితరాలకు అందించాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. తిరుపతిలో అవధాని మేడసాని మోహన్ ఆధ్వర్యంలో అంతర్జాలం ద్వారా చతుర్గుణిత అష్టావధానం నిర్వహిస్తుండగా..ఎన్.వి.రమణ తొలి ప్రశ్న వేసి అష్టావధానాన్ని ప్రారంభించారు. అవధాన ప్రక్రియ తెలుగు భాషకు ప్రత్యేకమని ఎన్.వి.రమణ అన్నారు. శతాబ్దాల సాహితీ తపస్సు నుంచి అవధానం ఉద్భవించిందన్నారు. జ్ఞాపకశక్తి, అపార మేధస్సు, భాష మీద పట్టు మేళవింపే అవధానమని వ్యాఖ్యానించారు. మాతృభాష..జాతి ఔన్నత్యానికి ప్రతీక అని అభిప్రాయపడ్డారు. తెలుగువాడు భాషాభిమాని తప్ప దురాభిమాని కాదన్నారు.
శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం జీవన గమనాన్ని మారుస్తోంది. తెలుగు భాషకు ఆదరణ తగ్గించడానికి ప్రయత్నాలు జరగుతున్నాయి. సాహితీ ప్రక్రియను జనరంజకంగా తీర్చిదిద్దాలి. సాహిత్య రూపం కనుమరుగైతే తిరిగి సృష్టించలేం. సాహితీ ప్రక్రియ ప్రస్తుత పరిస్థితులకు అద్దంపట్టేలా మార్పు చేసుకోవాలి. సాహితీ సేవలో నా వంతు కృషి చేయడానికి ముందుంటా. -భారత ప్రధాన న్యాయమూర్తిజస్టిస్ ఎన్.వి.రమణ