'జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ని.. ఈ రాష్ట్రానికి అధిపతిగా చూడాలన్నది మా ఆశయం. పవన్ కల్యాణ్‌ను మనం సముచితంగా గౌరవించాలని... స్వయానా ప్రధాని మోదీనే నాకు చెప్పారు'...రెండ్రోజుల క్రితం భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన ఈ వ్యాఖ్యలు.. జనసేనలో నూతనోత్సాహాన్ని నింపాయి. హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల నుంచి తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక వరకూ పోటీకి దిగకుండా ప్రతీచోట భాజపాకు మద్దుతుదారుగానే నిలబడాల్సి రావటం.. క్షేత్రస్థాయిలో జనసేన కార్యకర్తల్లో అసంతృప్తిని నింపిందనేది ఆ పార్టీ నేతల అభిప్రాయం. ఇలాంటి పరిస్థితులు ఉన్న చోట కూటమిగా సాగటం కష్టమని గ్రహించిన భాజపా.. జనసైనికులను ఉత్సాపరిచేలా తిరుపతిలో ప్రకటన చేసింది. పవన్ కల్యాణ్ ఈ రాష్ట్రానికి కాబోయే అధిపతి అంటూ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
జోష్ లో జనసేన క్యాడర్...
2019 సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతి లోక్‌సభ స్థానాన్ని వైకాపా కైవసం చేసుకోగా తెదేపా అభ్యర్థి రెండోస్థానంలో..జనసేన-బీఎస్పీ కూటమి మూడో స్థానంలో నిలిచాయి. ఇలాంటి తరుణంలో .. తమకంటే తక్కువ ఓట్లు సాధించిన భాజపాకు సీటు ఎలా వదులుకుంటారనేది.. జనసైనికుల నుంచి వినిపించిన ప్రశ్న. దీనిపై తన తిరుపతి పర్యటనలో పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వివరించే ప్రయత్నించారు. తిరుపతి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల కార్యకర్తల సమావేశాల్లో పార్టీ నిర్ణయం వెనుక కారణాలు విశ్లేషించారు. భాజపా అభ్యర్థి విజయం సాధిస్తే కేంద్రం నుంచి ఈ ప్రాంతానికి రావాల్సిన నిధులను తేలికగా తీసుకురావచ్చని..అభివృద్ధి సాధ్యపడుతుందనేది జనసేన నిర్ణయానికి కారణంగా వివరించారు. క్యాడర్ సంతృప్తి పడుతుందనుకుంటున్న తరుణంలోనే సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు.. పార్టీ శ్రేణుల్లో జోష్ నింపాయి. భాజపా అభ్యర్థి రత్నప్రభకు మద్దతుగా.. ఏప్రిల్ 3న పవన్ తిరుపతి రానున్నట్లు నాదెండ్ల ప్రకటించారు. అదేరోజు మధ్యాహ్నం ఎమ్మార్‌పల్లి కూడలి నుంచి శంకరంబాడీ కూడలి వరకూ జరిగే పాదయాత్రలో పవన్ కల్యాణ్‌తోపాటు.. భాజపా రాష్ట్ర అగ్రనేతలు పాల్గొంటారని మనోహర్ తెలిపారు.