తిరుపతి ఉపఎన్నికలో ప్రచారం చేసే నిమిత్తం జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వచ్చేవారం తిరుపతి పార్లమెంట్ పరిధిలో పర్యటించనున్నారని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. తిరుపతిలో నిర్వహించిన జనసేన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తిరుపతి లోక్సభ ఉపఎన్నికల్లో భాజపాకు మద్దతుగా అనుసరించాల్సిన వ్యూహాలపై నాయకులతో చర్చించారు.
తిరుపతి ఉపఎన్నికకు జనసేనకు వార్మప్ మ్యాచ్ లాంటిదని నాదెండ్ల అన్నారు. ఈ ఎన్నిక ద్వారా జనసేన నాయకులు, కార్యకర్తలు తమ బలాన్ని పరీక్షించుకోవాలన్నారు. వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించిన ఆయన.. భాజపా బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో జనసేన బలపడాలని కోరారు. వాలంటీర్లు, పోలీసులు బెదిరించి ఓట్లు వేయించుకుంటాన్నారని విమర్శించిన నాదెండ్ల.. శ్రీకాళహస్తిలో ఓ డీఎస్పీ అధికార పార్టీలో చేరాలని నేరుగా నాయకులపై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. తిరుపతి సీటు భాజపాకు వదులుకోవటం వెనక స్పష్టమైన ఆలోచనలున్నాయన్నారు. కేంద్రంలోనూ.. తిరుపతిలోనూ భాజపా ఉంటే ప్రగతి సాధ్యమన్నారు.