టైమ్‌స్లాట్ సర్వదర్శనాన్ని త్వరలోనే పునరుద్ధరిస్తామని తితిదే ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి స్పష్టం చేశారు. టోకెన్లు లేకున్నా నేరుగా వెళ్లేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. రెండింటినీ సమాంతరంగా అమలు చేస్తామని, ఏ విధానంలో వెళ్లాలనేది భక్తుల అభీష్టమని సోమవారం ‘ఈటీవీ భారత్’కి వెల్లడించారు. ‘భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని స్లాటెడ్ విధానాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది. త్వరగా దర్శనం కావాలనుకుంటే టైమ్‌స్లాట్‌లో టోకెన్ తీసుకోవాలి. ఇందుకు అవసరమైన క్యూలైన్లు, షెడ్లతో కూడిన కేంద్రాలను శాశ్వత ప్రాతిపదికన తిరుపతి బస్టాండ్, రైల్వేస్టేషన్‌తోపాటు కొండకు వెళ్లే మార్గంలో ఆరు నుంచి ఎనిమిది ప్రదేశాల్లో త్వరలో అందుబాటులోకి తెస్తాం. పాత వాటిని పునరుద్ధరించడంతో పాటు కొత్త వాటిని ఏర్పాటు చేస్తాం. టోకెన్ జారీ కేంద్రాల వద్ద భక్తులకు అసౌకర్యం లేకుండా చూస్తాం. టోకెన్ తీసుకోవడం ప్రయాస అనుకుంటే వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌కు వెళ్లవచ్చు. దీనికి అనుగుణంగా చర్యలు చేపడుతున్నాం. వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్థానికుల కోసమే ఆరు కేంద్రాలు ఏర్పాటు చేశాం. వీఐపీ బ్రేక్ దర్శనానికి ఇప్పటికే సెలవు రోజుల్లో సిఫార్సు లేఖలు అనుమతించడం లేదు. వేసవి సెలవుల నేపథ్యంలో వీఐపీలు లేఖలు ఇవ్వవద్దు. ఇచ్చినా అనుమతించం. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి’ అని జవహర్‌రెడ్డి పేర్కొన్నారు.
- సర్వదర్శనం టైమ్‌స్లాట్ టోకెన్లు జారీచేసే విధానంపై పరిశీలన చేస్తున్నామని తితిదే అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి కూడా తెలిపారు. ఇటీవల ఎస్‌ఎస్‌డీ(స్లాటెడ్ సర్వదర్శనం) టోకెన్ల జారీ కేంద్రం వద్ద చోటుచేసుకున్న స్వల్ప తోపులాట నేపథ్యంలో టోకెన్ల జారీని రద్దుచేసి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి భక్తులను ధర్మదర్శనానికి అనుమతిస్తున్నామని చెప్పారు.