తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం ఉప ఎన్నికలో ఏ చేతి వేలికి సిరా వేయాలో అర్థం కాక ఎన్నికల అధికారులు తలపట్టుకుంటున్నారు. ఇటీవల వరుసగా జరిగిన పంచాయతీ, పురపాలక ఎన్నికల్లో ఓటర్ల ఎడమ చేయి చూపుడు వేలికి సిరా గుర్తువేశారు. ఈనెల 17న జరిగే తిరుపతి ఉప ఎన్నికల్లో కుడి చేయి వేలికి వేస్తామంటూ ఉప ఎన్నికల అధికారి, నెల్లూరు జిల్లా కలెక్టరు చక్రధర్‌బాబు ఇటీవల ప్రకటించారు.
మరోవైపు ఈనెల 8నే మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించనున్నారు. అంటే తిరుపతి ఎంపీ స్థానం పరిధిలోని గ్రామాల్లో మూడు... నగర, పురపాలక ప్రాంతాల్లో రెండు ఎన్నికలు జరిగినట్లవుతుంది. నగరాలు, పట్టణాల్లో ఎలాంటి సమస్య లేనప్పటికీ.. గ్రామాల్లో సిరా వేయాల్సిన చేతి వేలి విషయంలో నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. దీనిపై ఎన్నికల సంఘం ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు.