తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూకాంప్లెక్స్ వెలుపల 2 కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరి వేచిఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగిందని తితిదే ఈవో ధర్మారెడ్డి తెలిపారు. క్యూలైన్‌లోని భక్తుల దర్శనానికి 2 రోజుల సమయం పడుతుందన్నారు. భక్తులకు అల్పాహారం, నీరు, పాలు అందిస్తున్నామని తెలిపారు. రేపు రాత్రి వరకు రద్దీ కొనసాగే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో శని, ఆదివారాల్లో బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్టు ఈవో స్పష్టం చేశారు.
దళారి మోసం:ప్రత్యేక ప్రవేశ దర్శనం పేరుతో ఓ దళారి ఎనిమిది మంది భక్తులను మోసం చేశారు. పాత టికెట్లతో భక్తులు దర్శనానికి వెళ్తున్నట్లు సిబ్బంది గుర్తించారు. విచారణ చేపట్టిన విజిలెన్స్ సిబ్బంది.. దళారి రాజు భక్తులకు టికెట్లను అంటగట్టినట్లు తేలింది. పొరుగు సేవల సిబ్బంది వెంకటేశ్‌తో కలిసి రాజు అక్రమాలకు పాల్పడ్డారు. దళారికి సహకరించిన వెంకటేశ్‌పై శాఖపరమైన చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.