తితిదే లీగల్ ఆఫీసర్గా రెడ్డెప్పరెడ్డి నియామకంపై వివరాలు సమర్పించాలని తితిదే ఈవోను హైకోర్టు ఆదేశించింది. విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. తితిదే లా ఆఫీసర్ గా విశ్రాంత న్యాయాధికారి రెడ్డెప్పరెడ్డి నియామకాన్ని సవాలు చేస్తూ జర్నలిస్ట్ బి.దొరస్వామి హైకోర్టులో పిల్ వేశారు. తితిదే తరపు న్యాయవాది పి.మహేశ్వరరావు వాదనలు వినిపించారు.
వ్యాజ్యం మొదటిసారి విచారణకు వచ్చిన నేపథ్యంలో.. వివరాలు సమర్పించేందుకు సమయం కావాలని కోరారు. విశ్రాంత న్యాయాధికారిని తితిదేలా ఆఫీసర్గా నియమించడం 2020 జనవరి 22న ప్రభుత్వం జారీచేసిన జీవో 16కు విరుద్ధం అని పిటిషనర్ తరపు న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు. సర్వీసులో ఉన్న న్యాయాధికారినే లా ఆఫీసర్గా నియమించాలన్నారు. లా ఆఫీసర్ రెడ్డెప్పరెడ్డి పదవీకాలం వచ్చే డిసెంబర్ 6వ తేదీతో ముగుస్తుందన్నారు. ఈ నేపథ్యంలో వ్యాజ్యాన్ని త్వరగా విచారించాలన్నారు.