తిరుపతి రుయా ఆస్పత్రి ఘటనపై హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. తెదేపా నేత పి.ఆర్.మోహన్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఫిర్యాదు ఇచ్చినా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది యలమంజుల బాలాజీ వాదించారు. ఆక్సిజన్ సమయానికి రోగులకు అందలేదని ఆరోపించారు. బాధ్యులపై కేసు నమోదు చేయాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోరారు. 36 మంది చనిపోతే ప్రభుత్వం 11 మందేనని చెబుతోందని కోర్టుకు తెలిపారు.
ఈ అంశంపై న్యాయ విచారణకు ఆదేశించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరారు. కేంద్రం ఇచ్చిన 5 ప్లాంట్లను నేటివరకు నెలకొల్పలేదని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. వాదనలు పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, తిరుపతి ఎస్పీకి ధర్మాసనం నోటీసులు జారీచేసింది. వేసవి సెలవుల అనంతరం కోర్టు ప్రారంభమయ్యే తొలిరోజుకు విచారణ వాయిదా వేసింది.