ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుమల వరద విలయంలో చిక్కుకుంది. ఎన్నడు లేని విధంగా కురిసిన వర్షాలు భక్తులకు భీతవాహ పరిస్థితిలా తలపించింది. నలువైపులనుంచి వచ్చిన వరద తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. అలిపిరి, శ్రీవారి మెట్టు కాలినడక మార్గంలో వరద నీరు ప్రవహిస్తుండటంతో ఈ మార్గాలను ఇప్పటికే మూసివేసిన తితిదే (ttd).. శుక్ర, శనివారాలు సైతం అనుమతించేది లేదని స్పష్టం చేసింది.
అటవీ ప్రాంతం నుంచి భారీ స్థాయిలో వస్తున్న వరద... మెట్లపై ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నీటి ప్రవాహంతో మెట్ల మార్గం జలపాతంలా కనిపిస్తోంది. ఇప్పటికే ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్న తితిదే.. నడక మార్గంలో భక్తులను అనుమతించడం లేదు. దీనివల్ల పెద్ద ప్రమాదమే తప్పింది. కొండ పైనుంచి వస్తున్న నీటితో కపిలేశ్వరాలయం వద్ద జలపాతం జోరుమీదుంది.పాపవినాశనం, జపాలి క్షేత్రాలకు వెళ్లే మార్గాల్లోనూ పెద్ద ఎత్తున వరద నీరు ప్రవహిస్తుండటంతో ఆ దారులను సైతం తితిదే మూసివేసింది. వర్షం తగ్గుముఖం పట్టిన తర్వాతే భక్తులను అనుమతించనున్నట్లు తెలిపింది.
కనుమదారుల్లో పెద్దఎత్తున కొండల పైనుంచి వరద నీరు జలపాతాలుగా పడుతుండటంతో కొండచరియలు విరిగిపడుతున్నాయి. రెండో కనుమదారిలో 14 చోట్ల కొండచరియలు కూలాయి. కనుమదారిలో చాలాచోట్ల వరద నీరు నిలిచిపోయి...రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. వన్యమృగాలు సైతం వరద భయంతో రోడ్లపైకి చేరాయి.
గతంలో ఏన్నడు లేని విధంగా...
గడిచిన 50 ఏళ్లలో తిరుపతిలో ఇంతటి వర్షాలను చూడలేదని ప్రజలు అంటున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, బయటకు రావొద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. పెద్ద ఎత్తున భారీ వర్షాలు, తుఫాన్లు తిరుపతి నగరాన్ని చుట్టుముడుతాయని వాతావరణ శాఖ పదే పదే హెచ్చరికలు చేస్తున్నా, తగిన ప్రత్యామ్నాయాలను ఏర్పాటు చేసుకోవడంలో అధికార యంత్రాంగం విఫలమైందని విమర్శలు వస్తున్నాయి.
ఘాట్ రోడ్లు మూసివేత...