ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

WEATHER UPDATE: రేపు ఉదయం చెన్నై సమీపంలో తీరం దాటనున్న వాయుగుండం

రాష్ట్రంలో చెన్నైకు సమీప జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. కాగా రాష్ట్రంలో చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, కాలువలు పొంగి పొర్లుతున్నాయి.

Rains in State
చెన్నైకి సమీప జిల్లాల్లో భారీ వర్షాలు

By

Published : Nov 18, 2021, 10:24 AM IST

Updated : Nov 18, 2021, 3:15 PM IST

నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిందని విపత్తు నిర్వహణశాఖ ప్రకటించింది. చెన్నైకి ఆగ్నేయంగా 310 కి.మీ దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైంది. చెన్నై సమీపంలో రేపు తెల్లవారుజామున వాయుగుండం తీరం దాటే అవకాశం ఉన్నట్లు తెలిపింది. తీరం దాటే సమయంలో రాయలసీమలో తేలికపాటి జల్లులు, పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని సూచించారు. తీరం వెంబడి గంటకు 45-65 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని..
రేపటివరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విపత్తు నిర్వహణశాఖ హెచ్చరించింది. లోతట్టుప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.

వర్షాలు..

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో వర్షం బీభత్సాన్ని సృష్టించింది. నక్కలేరు వాగు పొంగటంతో పంట పొలాలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. రామచంద్రాపురం నుంచి తిరుపతికి రాకపోకలు నిలిచిపోయాయి.

భారీ వర్షాలతో శ్రీకాళహస్తిలో వాగులు, వంకలు పొంగుతున్నాయి. వర్షం కారణంగా కొత్తూరులోకి వర్షపు నీరు చేరింది. మూర్తిపాళ్యెం గండి నుంచి దిగువకు వరద నీరు ప్రవాహించడంతో గొల్లపల్లె, కొత్తూరు, కుంటిపూడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

భారీ వర్షం కారణంగా ప్రకాశం జిల్లాలో అమరావతి రైతుల మహాపాదయాత్రకు నేడు విరామం ప్రకటించారు. రేపు ఉదయం యథావిధిగా గుడ్లూరు నుంచి యాత్ర ప్రారంభకానుంది.

నెల్లూరు జిల్లా ఆత్మకూరు పరిసర ప్రాంతాల్లో నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలుకు వాగులు, కాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి. కేతమన్నేరు వాగు, పెద్ద వాగు, నల్లవాగు వరద ప్రవాహం ఉధృతంగా ఉంది. దీంతో రాకపోకలను ఇబ్బందులు ఏర్పడ్డాయి.

అల్పపీడనం ప్రభావం వల్ల కడపలో ఇవాళ తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తోంది. గత మూడు రోజుల నుంచి వర్షాలు కురవక పోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. మళ్లీ తెల్లవారుజాము నుంచి వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. నగరంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు బిక్కు బిక్కు మంటూ జీవిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరింది. రోడ్లపై మోకాలు లోతు వరకు వర్షపు నీరు నిల్వ ఉన్నాయి. కడప నగరంలో ప్రవహిస్తున్న బుగ్గ వంక పరివాహక ప్రాంతాల ప్రజలు భయాందోళనలో ఉన్నారు.

ఇదీ చదవండి :

PADAYATRA : అమరావతి రైతుల మహా పాదయాత్రకు నేడు విరామం

Last Updated : Nov 18, 2021, 3:15 PM IST

ABOUT THE AUTHOR

...view details