రాష్ట్రంలో అకాల వర్షం అన్నదాతను కంటతడి పెట్టించింది. శుక్రవారం ఈదురుగాలులతో కూడిన వర్షం అక్కడక్కడ బీభత్సం సృష్టించింది. మరోవైపు అదే సమయంలో పిడుగులు పడటంతో రాష్ట్ర వ్యాప్తంగా ఏడుగురు మృతి చెందారు. పదుల సంఖ్యలో జీవాలు చనిపోయాయి. కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో గాలులు తీవ్రంగా వీచాయి. విజయవాడలోని బందరు రోడ్డులో రెండు వృక్షాలు నేలకూలి, 2 కార్లు ధ్వంసమయ్యాయి. నగరంలో విద్యుత్తు సరఫరా కొంతసేపు నిలిచిపోయింది.
అన్నదాత కుదేలు
తూర్పుగోదావరి జిల్లాలో అకాల వర్షానికి చేతికొచ్చిన వరి తడిసింది. కోతలకు సిద్ధంగా ఉన్న పైరు కొన్నిచోట్ల నేలవాలగా, మరికొన్నిచోట్ల కళ్లాల్లోని ధాన్యం రాశులు తడిసిపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ఏజెన్సీలో మిర్చి రైతులు నష్టపోయారు. వర్షానికి తోటల్లో కోతకొచ్చిన మిరపకాయలు రాలిపోయాయి. కోసి కళ్లాల్లో ఉంచిన మిరప తడిసి ముద్దయింది. అరటి పంటకు సైతం నష్టం వాటిల్లింది. ప్రకాశం జిల్లాలో మార్టూరు, ముండ్లమూరు, దర్శి ప్రాంతాల్లో పంట నష్టం నెలకొంది. కర్నూలు జిల్లాలో ఓర్వకల్లు, చాగలమర్రి, పత్తికొండ, ఆత్మకూరు, నందికొట్కూరుల్లో భారీ గాలి వానకు మామిడి కాయలు నేలరాలాయి. మిర్చి తడిసింది. చిత్తూరు జిల్లాలో అక్కడక్కడ విద్యుత్తు స్తంభాలు విరిగాయి. నెల్లూరు జిల్లాలో ఉదయగిరి, ఆత్మకూరు, సంగం, మర్రిపాడు, అనంతసాగరం, చేజర్ల, దుత్తలూరు, వరికుంటపా డు మండలాల్లో మామిడి, నిమ్మ తోటలు దెబ్బతిన్నాయి.
తిరుమల వీధులు జలమయం
తిరుమలలో శుక్రవారం మధ్యాహ్నం నుంచి 2 గంటలపాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. భారీ ఈదురు గాలులు, పిడుగుల శబ్దాలతో పరిసరాలు దద్దరిల్లాయి. వర్షంతో శ్రీవారిని దర్శించుకుని బయటకు వస్తున్న భక్తు లు గదులకు చేరుకునేందుకు ఇబ్బంది పడ్డారు. ఆలయం ఎదుట, మాడ వీధులు, బయట రోడ్లన్నీ జలమయమయ్యాయి. కొన్నిచోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి.