శ్రీవారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకు అలిపిరి నుంచి ఆనందనిలయం వరకూ అడుగడుగునా కష్టాలు ఎదురవుతున్నాయి. కొవిడ్ సమయంలో అనేకమంది తమ కోసం, తమవాళ్ల కోసం అనేక మొక్కులు మొక్కుకున్నారు. వృద్ధులు తమ జీవిత చరమాంకంలో ఒక్కసారైనా స్వామిని దర్శించుకుని తరించాలన్న భావనలో ఉన్నారు. కొవిడ్ ఆంక్షలు తొలగడంతో భక్తులు తిరుమల వేంకటేశ్వరుని దర్శనానికి పోటెత్తుతుండగా వీరికి అన్నిరకాలుగా ఆటంకాలు తప్పట్లేదు.
కాలినడకన అనుమతి ఎప్పుడు?
కొవిడ్‌కి ముందు ఇటు అలిపిరితోపాటు అటు శ్రీవారి మెట్టుమార్గం ద్వారా కాలినడకన తిరుమలకు అనుమతించేవారు. అలిపిరి మార్గంలో రోజుకు 20వేలు, శ్రీవారి మెట్టుమార్గంలో 6వేల చొప్పున టోకెన్లు జారీచేసేవారు. నడకదారిన వచ్చే భక్తులకు శీఘ్రదర్శనం పేరుతో ప్రత్యేకంగా క్యూలైన్లను ఏర్పాటుచేశారు. 2020 మార్చిలో లాక్‌డౌన్ విధించిన తర్వాత... మళ్లీ ఇప్పటివరకూ దాన్ని పునరుద్ధరించలేదు. నడకదారిన వెళ్లే భక్తుల్ని సైతం ముందుగా సర్వదర్శనం/ప్రత్యేక ప్రవేశదర్శనం (రూ.300) టోకెన్లు ఉంటేనే అనుమతిస్తున్నారు. సర్వదర్శన టోకెన్ల కోసం గంటలకొద్దీ క్యూలైన్లలో నిల్చుని, మళ్లీ నడకమార్గం ద్వారా వెళ్లి దర్శనం చేసుకోవాలంటే ఇబ్బందిగా ఉందని భక్తులు వాపోతున్నారు. మరోవైపు అటు శ్రీవారి మెట్టు మార్గం ఐదు నెలలుగా మూసి ఉంది. గత ఏడాది తుపాను కారణంగా ఈ మార్గం కొట్టుకుపోయింది. మరమ్మతుల కోసం గుత్తేదారులకు పనులు అప్పగించినా ఇంకా పూర్తికాలేదు. ప్రస్తుతం అలిపిరి నడకమార్గం ఒక్కటే అందుబాటులో ఉంది. శ్రీవారి మెట్టు మార్గం 2.1 కి.మీ.లు కాగా, అలిపిరి నుంచి తిరుమలకు 7.8 కి.మీ.లు ఉంది. సాధారణంగా ఎక్కువమంది అలిపిరి మార్గంలో వెళ్తుంటారు. మరోపక్క, మార్చి నెలాఖరుకు శ్రీవారి మెట్టు అందుబాటులోకి తెస్తామన్నా ఇప్పటికీ పనులు పూర్తిచేయలేదు. మెట్టు మార్గాన్ని త్వరగా అందుబాటులోకి తీసుకురావడంతో పాటు శీఘ్రదర్శన టోకెన్లు పునరుద్ధరించాల్సి ఉంది.
అన్న ప్రసాదానికి ఎదురుచూపులు
కొవిడ్‌కి ముందు క్యూలైన్లలో ఉన్న భక్తులకు అల్పాహారం, పాలు, మజ్జిగ అందించేవారు. కొవిడ్ ఉద్ధృతి తగ్గాక వీటి సరఫరా నిలిపివేశారు. వైకుంఠ ఏకాదశి రోజున భక్తులకు కనీసం తాగునీరూ ఇవ్వకపోవడంతో శ్రీవారి ప్రధానద్వారం వద్దనే క్యూలైన్లలో కూర్చుని భక్తులు ఆందోళన చేయడం అక్కడి పరిస్థితులకు అద్దం పట్టింది. అయినా అధికారుల్లో మార్పు కనిపించలేదు. భక్తులు అన్నదాన సత్రంలో అన్నప్రసాదాన్ని భక్తితో స్వీకరిస్తారు. అక్కడ ఒకేసారి 4వేల మందికి అన్నదానం చేయొచ్చు. కానీ అంతకు రెట్టింపు సంఖ్యలో రావడంతో అన్నం కోసం గంటలకొద్దీ నిరీక్షించాల్సి వస్తోంది. గతంలో వివిధ ప్రాంతాల్లో ఏడు కౌంటర్లను ఏర్పాటు చేసి భక్తులకు ఆహారాన్ని అందించారు. ఇప్పుడు రెండే ఉన్నాయి. అదే ఈ సమస్యకు కారణమవుతోంది.