ప్రభుత్వ ఉద్యోగుల అర్థిక ప్రయోజనాలు పరిష్కరించేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని ఉద్యోగులు సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. చర్చకు రాకుండా దాక్కోవడం మంచి పద్ధతి కాదంటూ హెచ్చరించారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. రాష్ట్ర ఆర్థిక ప్రయోజనాలు మెరుగు పడాలని.. ఉద్యోగులకు అన్ని రకాల బెనిఫిట్స్ రావాలని స్వామివారిని ప్రార్థించాని తెలిపారు. పాదయాత్రలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలను సీఎం నిలబెట్టుకోవాలని కోరిన ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు.. ప్రభుత్వం ఏర్పడి రెండున్నర ఏళ్లు గడుస్తున్నా ఎలాంటి ప్రయోజనం లేదని విమర్శించారు.
ప్రభుత్వంపై ఉద్యోగులు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారని.. ఉద్యోగ విరమణ పొందిన వారికి పెన్షన్ కూడా సకాలంలో రావడం లేదని తెలిపారు. నెల సగం రోజులు గడుస్తున్నా ఇంకా చాలా మందికి జీతాలు రాలేదని చెప్పారు. ఉద్యోగులు మౌనంగా ఉన్నారనుకుంటే.. ప్రభుత్వానికే నష్టమని హెచ్చరించారు. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థలో లోపాలున్నాయని ఆర్థిక మంత్రి చెబుతున్నారని.. దీనిపై సీఎం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.