JNTU Anantapur 12th convocation: ‘దేశం నాకోసం ఏం చేస్తుందని అడగకుండా.. దేశం కోసం నేనేం చేయగలను’ అనే ధోరణితో యువత ముందుకెళ్లాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పిలుపునిచ్చారు. శనివారం అనంతపురం జేఎన్‌టీయూలో నిర్వహించిన స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఆయన పట్టభద్రులకు దిశానిర్దేశం చేశారు. దేశ భవిష్యత్తు యువత మేధో సంపత్తిపై ఆధారపడి ఉందని, వినూత్న ఆవిష్కరణల దిశగా అడుగులు వేయాలని సూచించారు. సొంత కలల్ని నెరవేర్చుకోవడంతోపాటు పొరుగువారి లక్ష్యాలకు తోడ్పాటు అందించాలని పేర్కొన్నారు. జాతీయ విద్యా విధానం-2020ను పక్కాగా అమలు చేస్తోందని అనంత జేఎన్‌టీయూను అభినందించారు.
పేదరిక నిర్మూలన సాంకేతికతతోనే సాధ్యమవుతుందని ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమనాథ్ అన్నారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థి, డీఆర్‌డీవో ఛైర్మన్ సతీష్‌రెడ్డికి జేఎన్‌టీయూ తరఫున గవర్నర్ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. రక్షణ రంగంలో పరిశోధనలు చేసుకునేందుకు ఇక్కడి విద్యార్థులకు డీఆర్‌డీవో తరఫున అవకాశాలు కల్పిస్తామని సతీష్‌రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం 2021-22 విద్యా సంవత్సరంలో ప్రతిభ చూపిన, డిగ్రీ విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. కార్యక్రమంలో జేఎన్‌టీయూ ఉపకులపతి రంగ జనార్దన, రెక్టార్ విజయ్ కుమార్, రిజిస్ట్రార్ శశిధర్, కలెక్టర్ నాగలక్ష్మి, జేసీ కేతన్ గార్గ్, శింగనమల ఎమ్మెల్యే పద్మావతి, ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి పాల్గొన్నారు.