దేశంలోని ప్రముఖ బ్యాటరీ తయారీదార్ల సంస్థ అమరరాజా బ్యాటరీస్ లిమిటెడ్ ఛైర్మన్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు గల్లా రామచంద్రనాయుడు ప్రకటించారు. తిరుపతిలోని అమరరాజా కార్యాలయంలో వర్చువల్‌గా జరిగిన బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తదుపరి ఛైర్మన్‌గా ఎంపీ గల్లా జయదేవ్‌ను(MP GALLA JAYADEV) ఆగస్టులో జరిగే బోర్డు సమావేశంలో ఎన్నుకోనున్నట్లు సంస్థ యాజమాన్యం ప్రకటించింది.
ప్రస్తుతం నాన్‌ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కొనసాగుతున్న డాక్టర్ రమా గౌరినేని బాధ్యతల నుంచి తప్పుకోగా.. ఆమె కుమారులు హర్షవర్థన్ గౌరినేని, విక్రమాదిత్య గౌరినేనిలు నూతన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా నియమితులయ్యారు. ఈ మేరకు బోర్డు తీసుకున్న నిర్ణయాలను అమరరాజా(AMARA RAJA) యాజమాన్యం ప్రకటించింది. సంస్థ పురోభివృద్ధి దృష్ట్యా లిథియం-అయాన్ బ్యాటరీలతో సహా సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాల అమలు విషయంలో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టాలని అమరరాజా నిర్ణయించింది. దీని ద్యారా ఎనర్జీ, మొబిలిటీ రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌ను అందిపుచ్చుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు సంస్థ ప్రకటించింది.