ఉచిత సేవల స్థానంలో నిర్వహణా వ్యయం చెల్లించి మరీ నూతన ఏజెన్సీకి బాధ్యతలు అప్పగించే సమయంలో తి.తిదే. అధికారులు చేసిన ప్రకటనలకు.. ప్రస్తుతం అందుతున్న సేవలకు లంకె కుదరడం లేదు. సేవలన్నీ ఒకే కేంద్రంలో అందుబాటులోకి వస్తాయన్న ప్రకటన అమలుకు నోచుకోలేదు. ప్రైవేటు ఏజెన్సీ సేవలు కూడా పాత పద్ధతిలోనే ఉండటం భక్తులను నిరాశ పరుస్తోంది.
గతంలో శ్రీవారి సేవకులు, వివిధ బ్యాంకులు ఉచితంగా అందించే సేవలను.. ఇటీవల బెంగళూరుకు చెందిన కేవీఎం ఇన్ఫోకామ్ సంస్థకు తి.తి.దే అప్పగించింది. లడ్డూ కవర్లు మొదలు అన్ని సేవలు ఒకే కేంద్రంలో అందుబాటులోకి వస్తాయని అధికారులు ప్రకటించినా... వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. నెలకు 5 కోట్ల రూపాయల నిర్వహణా వ్యయం చెల్లించి ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించడంతో... లడ్డూ విక్రయ కేంద్రాల్లో మెరుగైన సేవలు అందుతాయని భక్తులు ఆశించారు.