ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TTD: తిరుమలలో దళారుల చేతివాటం.. ప్రత్యేక దర్శన టికెట్ల పేరుతో మోసాలు.. కేసు నమోదు - Fraud in the name of special entrance darshan in Tirumala

Darshan Tickets Fraud at Tirumala: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల రద్దీని ఆసరా చేసుకొన్న దళారులు... అక్రమాలకు పాల్పడుతున్నారు. తితిదే సిబ్బందితో కుమ్మక్కై సర్వదర్శనం టోకెన్లను పక్కదారి పట్టిస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల ద్వారా త్వరగా దర్శనం కల్పిస్తామని నమ్మబలికి మోసాలకు పాల్పడుతున్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన భక్తులను ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల పేరుతో మోసం చేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Darshan Tickets Fraud at Tirumala
Darshan Tickets Fraud at Tirumala

By

Published : Apr 7, 2022, 4:46 AM IST

Updated : Apr 7, 2022, 6:29 AM IST

తిరుమలలో ప్రత్యేక దర్శన టికెట్ల పేరుతో మోసాలు.. కేసు నమోదు

TTD News: కరోనా అనంతరం తిరుమలలో సాధారణ పరిస్థితులు నెలకొని శ్రీవారిని దర్శించుకొనే భక్తుల సంఖ్య పెరగడంతో దళారులు తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల ద్వారా వెంటనే దర్శనం కల్పిస్తామని నమ్మబలుకుతూ అక్రమాలకు పాల్పడుతున్నారు. తిరుపతిలోని సర్వదర్శన కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న పొరుగు సేవల ఉద్యోగుల సహకారంతో సర్వదర్శన టోకెన్లను పక్కదారిపట్టిస్తున్నారు. బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌ ప్రాంతాల్లో శ్రీవారి దర్శనానికి వేచిచూస్తున్న వారితో మాటలు కలిపి ప్రత్యేక ప్రవేశదర్శన టికెట్ల ద్వారా దర్శనం కల్పిస్తామని మోసం చేస్తున్న తీరు.. తితిదే నిఘా అధికారుల విచారణలో వెలుగు చూసింది. భక్తుల ఆధార్‌ కార్డులను తీసుకెళ్లి సర్వదర్శన టోకెన్లు జారీ చేస్తున్న కేంద్రాల సిబ్బందికి అందజేసి భక్తుడి ఫోటో అస్పష్టంగా వచ్చేలా టోకెన్‌ జారీ చేస్తున్నట్లు తితిదే నిఘా విభాగం సిబ్బంది గుర్తించారు.

గత నెల అనంతపురం జిల్లా గుంతకల్లు నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన ఐదుగురు భక్తులను మోసగించిన తీరు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భక్తులు.. మార్చి 30న గుంతకల్లు నుంచి తిరుమలకు వచ్చారు. వాళ్ల దగ్గరకు వెళ్లిన ముగ్గురు దళారులు.. రూ. 500 చెల్లిస్తే రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్‌ ద్వారా శ్రీవారి దర్శనం కల్పిస్తామని నమ్మబలికారు. భక్తుల ఆధార్‌ కార్డు తీసుకొని తిరుపతి గోవిందరాజస్వామి సత్రాలలో సర్వదర్శన టోకెన్ల జారీ కేంద్రానికి వెళ్లి.. సిబ్బంది సహకారంతో భక్తుల ఫోటోలు అస్పష్టంగా వచ్చే టోకెన్లు తీసుకొన్నారు. వాటిని భక్తులకు విక్రయించి సొమ్ము చేసుకొన్నారు. దళారుల నుంచి సర్వదర్శన టోకెన్లు తీసుకొన్న గుంతకల్లు భక్తులు తిరుమలలో ప్రత్యేక ప్రవేశ దర్శన ప్రవేశ ద్వారం వద్దకు వెళ్లడంతో దళారుల అక్రమాలు వెలుగులోకి వచ్చాయి.

సర్వదర్శన టోకెన్‌ కావడంతో ప్రత్యేక ప్రవేశ ద్వారా వద్ద భక్తులను అనుమతించలేదు. ఐదు వందల రూపాయలు పెట్టి కొన్నామని ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్‌ అని చెప్పడంతో విచారణ నిర్వహించిన తితిదే నిఘా విభాగం అధికారులు టోకెన్‌ జారీ చేసిన కేంద్రం కౌంటర్‌ను గుర్తించి సిబ్బందిని అదుపులోకి తీసుకొన్నారు. సర్వదర్శన టోకెన్‌ కేంద్ర సిబ్బందిని విచారించడంతో దళారుల గుట్టు బయటపడింది. తితిదే విజిలెన్స్ అధికారుల ఫిర్యాదుతో పొరుగుసేవల సిబ్బంది ఇద్దరిపై కేసు నమోదు చేసిన తిరుమల పోలీసులు.. దళారుల కోసం గాలిస్తున్నారు.

ఇదీ చదవండి:భారత్​లోకి కరోనా​ కొత్త వేరియంట్.. ఒమిక్రాన్​కన్నా డేంజరస్!

Last Updated : Apr 7, 2022, 6:29 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details