ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 1, 2020, 5:19 AM IST

ETV Bharat / city

ఆకలేస్తే.. ఆర్డర్ చేయండి.. మేమున్నాం!

ప్రస్తుతం దేశమంతా లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది. అందరూ ఇళ్లలోనే ఉండిపోయారు. నిత్యావసరాలు అందుబాటులో ఉండటంతో చాలా మందికి తిండికి ఢోకా లేదనే చెప్పాలి. అయితే ఇంటి నుంచి బయటకు రాలేని వృద్ధులు, ఉద్యోగరీత్యా ఒంటరిగా ఉంటున్న వారితో పాటు చాలా మందికి ఈ పరిస్థితి కొంత ఇబ్బందిగా మారింది. అలాంటి వారు పస్తులుండకుండా, వారు కోరిన భోజనాన్ని అందించి కడుపు నింపుతున్నారు ఫుడ్‌ డెలివరీ బాయ్స్‌. ఉచితంగా కాకపోవచ్చు కానీ కఠిన ఆంక్షల్లోనూ విధులను నిర్వహిస్తున్నారు.

food delivery boys service in corona time
food delivery boys service in corona time

ఆకలేస్తే.. ఆర్డర్ చేయండి.. మేమున్నాం!

ఎక్కడికక్కడ బారికేడ్లు.. రహదారులంతా నిర్మానుష్యం... దారి పొడవునా నిలువరించే పోలీసులు... అయినా ఫుడ్ ఆర్డర్ తీసుకుని...బ్యాగు తగిలించుకుని అలుపెరగకుండా సాగిపోతూనే ఉన్నారు. మామూలు సమయాల్లో ఫుడ్ ఆర్డర్...డెలివరీ ఇవ్వటం పెద్ద సమస్యేం కాదు. ఆర్డర్ తీసుకున్న హోటల్ నుంచి కస్టమర్​కి డెలివరీ ఇచ్చేంత వరకూ...ప్రయాణించే దూరాన్ని కిలోమీటర్ల చొప్పున లెక్కించి కమీషన్ పొందుతారు. కానీ కరోనా లాంటి మహమ్మారి ప్రబలుతున్న వేళ...ఇప్పుడు వీరే చాలా మందికి ఆపద్భాంధవులు. ఇంటి నుంచి బయటకు కాలు పెట్టలేని వృద్ధులు....చంటిపిల్లలున్న తల్లులు, వసతి గృహాలు మూసేయటంతో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు.. ఇప్పుడు ఫుడ్​ డెలివరీ బాయ్స్ సమయానికి వచ్చి ఆకలి తీర్చే అన్నదాతలు.

బయట పెట్టి.. ఫొటో తీస్తారు..

కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని ఫుడ్ డెలివర్ చేసే.... సంస్థలు నిర్ధిష్టమైన ప్రణాళికలు రచించుకున్నాయి. ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్స్ స్విగ్గీ, జొమాటో.....నో కాంటాక్ట్ డెలివరీ పేరిట ప్రత్యేక కార్యచరణ ప్రణాళికలను రూపొందించాయి. సాధారణంగా ఆర్డర్ పెట్టుకున్న హోటల్ నుంచి ఆహారాన్ని తీసుకుని వెళ్లి...కస్టమర్లకి ఫుడ్ డెలివరీ బాయ్స్ అందిస్తారు. అలాంటిది వైరస్ వ్యాప్తి నియంత్రణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలను దృష్టిలో పెట్టుకున్న ఫుడ్ డెలివరీ యాప్స్ సంస్థలు సైతం అప్రమత్తమయ్యాయి. నేరుగా కస్టమర్ చేతికి అందిచకుండా.....ఆర్డర్ పెట్టుకున్న వ్యక్తి ఉన్న ప్రదేశానికో, ఇంటికో తీసుకెళ్లి....అక్కడ బయటే పెట్టి ఫోటో తీసి కస్టమర్​కి పంపటం ద్వారా డెలివరీ బాయ్స్ తమ ఆర్డర్​ను పూర్తి చేస్తున్నారు.

అవగాహన కల్పించాయి

ఈ సౌలభ్యాన్ని స్విగ్గీ, జొమాటో కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చాయి. తద్వారా ఆహారాన్ని సరఫరా చేసే వ్యక్తి నుంచి సామాజిక దూరాన్ని పాటించే సౌలభ్యం కలుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ డెలివరీ బాయ్స్ విధులను నిర్వహించగలుగుతున్నారు. గ్లోవ్స్, మాస్క్ ధరించటం.....ఫుడ్ తీసుకునేప్పుడు...డెలివరీ ఇచ్చిన తర్వాత శానిటైజర్​ను వాడటం వంటివి చేసేలా సదరు సంస్థలు అవగాహన కల్పించాయి.

కమీషన్ తక్కువే..

పోలీసులు, వైద్యుల మాదిరిగానే ఇప్పుడు రహదారుల్లో కనిపిస్తున్నది ఫుడ్ డెలివరీ బాయ్స్ మాత్రమే. భయం లేకుండా.. అవసరమైన వారి ఆకలి తీర్చే విధంగా శ్రమిస్తున్నారు. సాధారణంగా కిలోమీటర్​కు కొంత చొప్పున కమీషన్​ను ఆదాయ రూపంలో ఆర్జించే డెలివరీ బాయ్స్....లాక్ డౌన్ కారణంగా బ్యారికేడ్లతో రహదారులను ఎక్కడికక్కడ మూసేయటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కోసారి రెండు కిలోమీటర్ల దూరంలోని ప్రాంతాన్ని చేరుకోవటానికి ఐదారు కిలోమీటర్లు చుట్టూ తిప్పుకుని ప్రయాణాలు చేయాల్సివస్తోంది. సేవా దృక్పథంతో తమ వంతు కృషి చేస్తున్నట్లు గర్వంగా చెబుతున్నారు.

ఇదీ చదవండి: కరోనా గురించి చైనా ఇన్ని అబద్ధాలు చెప్పిందా?

ABOUT THE AUTHOR

...view details