తిరుపతి ఉప ఎన్నికల్లో.. దొంగఓట్లు వేసేందుకు వచ్చినవారిని తెదేపా నాయకులు అడ్డుకున్నారు. తిరుపతి లక్ష్మీపురం కూడలి వద్ద.. తెలుగుదేశం నేతలు నిరసనకు దిగారు. ఉపఎన్నికల పోలింగ్ సందర్భంగా.. దొంగ ఓట్లు వేసేందుకు పెద్దఎత్తున ఇతర ప్రాంతాల నుంచి మనుషులను తీసుకొచ్చారంటూ ఆందోళనకు దిగారు. ఓ కల్యాణమండపంలో బయటి వ్యక్తులు బస చేశారన్న నేపథ్యంలో అక్కడి చేరుకున్న తెలుగుదేశం శ్రేణులు కల్యాణమండపం ఎదటు ఆందోళన చేశారు. తెలుగుదేశం నేతలు అక్కడికి చేరుకునే సరికి కల్యాణమండపంలో బస చేసిన వ్యక్తులు అక్కడి నుంచి జారుకున్నారు. ఎన్నికల సంఘం, పోలీసులు చర్యలు తీసుకోకపోవడంతోనే ఈ పరిస్థితి దాపురించిందని తెలుగుదేశం నేత సుగుణమ్మ ఆరోపించారు.
ఉప ఎన్నికల కోసం ఈ స్థాయిలో దొంగఓట్లకు వైకాపా పాల్పడుతుంటే..తమపైనే పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. ఎస్పీ కార్యాలయం ముందే ఓ ప్రైవేటు బస్సును ఆపిన తెదేపా నాయకులు.. బస్సులో ఉన్న వ్యక్తులను ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. బస్సు డ్రైవర్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చారని తెదేపా నాయకులకు చెప్పటంతో బస్సు ముందు కూర్చొని నిరసన తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం, పోలీసులు, దొంగ ఓట్లపై ఏ మాత్రం స్పందించటం లేదని తెదేపా నాయకులు ఆరోపించారు. ఏకపక్షంగా జరిపే ఈ ఎన్నికలు.. ఎందుకని తెదేపా ప్రశ్నించింది. ప్రజాస్వామ్య పక్షంలోనే ఎన్నికలు జరగాలని తెదేపా డిమాండ్ చేసింది.
సీఎం రాజీనామా చేయాలి: చింతా మోహన్
తిరుపతి ఉప ఎన్నికల్లో వైకాపా దొంగ ఓట్లు వేసేందుకు.. వేలమందిని తీసుకొచ్చిందని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చింతా మోహన్.. తీవ్ర స్థాయిలో ఆరోపించారు. కేంద్ర ఎన్నికల సంఘం, పోలీసులు, నిజాయితీగా ఉప ఎన్నికలను నిర్వహించటం లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ వెంటనే రాజీనామా చేయాలని.. చింతా మోహన్ డిమాండ్ చేశారు.