కొవ్వొత్తుల ప్రదర్శన, పళ్లాలు మోగించడం బదులు..ప్రాణవాయువు ఇచ్చి ఉంటే పరిస్థితులు బాగుండేవని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు. 60 ఏళ్లు పూర్తి చేసుకున్న వేళ.. రుయాలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. మోతాదుకు మించి కరోనా బాధితులను చేర్చుకోవడం, అనుభవం లేని అడ్మినిస్ట్రేషన్ వల్ల.. దాదాపు 40 మంది ఆక్సిజన్ లేక అరగంటలో మరణించడం బాధ కలిగించిందన్నారు.
తితిదే పాలక మండలి ధర్మకర్తలు దొంగ ఓట్లు వేయించడంలో చూపించిన శ్రద్ధ, ఆంజనేయ స్వామికి జన్మ ధ్రువీకరణ పత్రం ఇవ్వడంలో చూపిన చొరవ.. తిరుపతిలో ఆసుపత్రులకు ఆక్సిజన్ అందజేయడంలో చూపితే ఎంతో మంచి పేరు వచ్చి ఉండేదన్నారు. రాష్ట్రంలో కరోనాను నియంత్రించడంలో సీఎం జగన్ విఫలమయ్యారన్నారు. ప్రభుత్వాన్ని విమర్శించే వారిపై చర్యలు ఆపి.. కరోనా వ్యాధిపై దాడి చేయడం మంచిదని హితవు పలికారు. కేంద్రంలో మోదీ, ఇక్కడ జగన్‌కు..సంక్షోభంలో ఎలా పరిపాలించాలో తెలియడం లేదని ఆరోపించారు. ప్రజల ప్రాణాలను గాలిలో పెట్టిన దీపంలాగా మార్చడం దారుణమన్నారు.