తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఇకపై విద్యుత్ కార్లను వినియోగించనున్నారు. ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఇఇఎస్ఎల్) ద్వారా కొనుగోలు చేసిన 35 కార్లకు శ్రీవారి ఆలయం వద్ద ఇవాళ పూజలు చేశారు. అనంతరం తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డి జెండా ఊపి కార్లను ప్రారంభించారు. తితిదేలో పని చేసే ఉన్నతాధికారులు ఇకపై ఈ విద్యుత్ వాహనాలను వినియోగించనున్నారు. ఒక్కో వాహనానికి నెలకు రూ.32 వేలు చొప్పున అద్దె చెల్లించే విధంగా ఒప్పందం చేసుకున్నారు. ఐదేళ్ల తరువాత ఈ వాహనాలు తితిదేకు సొంతం కానున్నాయి.
పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తున్నామన్న తితిదే ఛైర్మన్ వైవీ..మూడు దశల్లో పూర్తి స్థాయిలో విద్యుత్ వాహనాల వినియోగానికి చర్యలు తీసుకుంటామన్నారు. రెండో దశలో ధర్మరథాల స్థానంలో విద్యుత్ బస్సులు, మూడో దశలో ఆర్టీసీ బస్సుల స్థానంలో విద్యుత్ బస్సులు ప్రవేశపెడతామన్నారు.
సంప్రదాయ భోజనం కార్యక్రమం రద్దు
తిరుమలలో ఇటీవల ప్రయోగాత్మకంగా ప్రారంభించిన సంప్రదాయ భోజన విధానాన్ని నిలిపివేయనున్నట్లు తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. ప్రకృతి వ్యవసాయంతో పండించిన ఉత్పత్తులతో భక్తులకు భోజనం అందించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారని తెలిపిన సుబ్బారెడ్డి.. భక్తులకు ఉచితంగా భోజనం పెట్టాలని.. అన్నప్రసాదానికి నగదును తీసుకోకూడదన్నారు. తితిదే పాలకమండలి లేని సమయంలో తీసుకున్న నిర్ణయంపై అధికారులతో చర్చించి శాశ్వతంగా నిలిపివేయనున్నట్లు చెప్పారు. కరోనా కారణంగా నిలిపి వేసిన ఉచిత సర్వదర్శనాన్ని అమలు చేసేందుకు చర్చిస్తామన్నారు. జిల్లా యంత్రాంగంతో మాట్లాడి వీలైనంత మందికి సర్వదర్శనం కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.