ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గరుడ వారధి.. ఏదీ నిధి! - tirumala garudavaradhi news

తిరునగరికి తలమానికంగా మారనున్న గరుడవారధి నిర్మాణం కొనసాగింపుపై సందేహాలు తలెత్తుతున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 22 నాటికి నిర్మాణం పూర్తి చేయాలని తిరుపతి స్మార్ట్‌సిటీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌, గుత్తేదారు సంస్థ ఆఫ్కాన్‌ మధ్య కుదిరిన రెండేళ్ల ఒప్పందం గడువు ముగియనుంది. ఇప్పటి వరకు 60 శాతం పనులే జరగ్గా మిగిలిన పనులపై అయోమయం నెలకొంది. 2021-22 వార్షిక బడ్జెట్‌ వరకు నిధులు ఇవ్వలేమని తితిదే స్పష్టం చేసిన నేపథ్యంలో పనుల కొనసాగింపుపై ఉత్కంఠ నెలకొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులతో తిరుపతి స్మార్ట్‌సిటీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌కు అందిన సొమ్ముతో ఇప్పటివరకు పనులు చేపట్టారు.

Doubts over the continuation of Garudavaradhi construction
గరుడవారధి నిర్మాణం కొనసాగింపుపై సందేహాలు

By

Published : Dec 5, 2020, 1:54 PM IST

రాష్ట్ర ప్రభుత్వం గరుడవారధి నిర్మాణానికి 2018 ఫిబ్రవరి 17న గుత్తేదారును ఎంపిక చేసి పనుల ప్రారంభానికి అనుమతులు ఇస్తూ జీవో జారీ చేసింది. వారధి నిర్మాణానికి అయ్యే వ్యయం రూ.684 కోట్లలో 67 శాతం అనగా రూ.458.28 కోట్లు తితిదే, తిరుపతి స్మార్ట్‌సిటీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ నుంచి 33 శాతం నిధులు అనగా రూ.225.72 కోట్లు చెల్లించాలని జీవోలో పేర్కొంది. ప్రభుత్వం మారగానే తొలుత గరుడవారధి పనులు నిలిపివేయాలని ఆదేశించినప్పటికీ ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో పునఃప్రారంభించారు. తిరుచానూరు వరకు వారధిని పొడిగించేలా డిజైన్‌లు మార్చాలని సూచించారు. అదనంగా మరో రూ.200 కోట్ల భారం పడుతుందని తేలడంతో ఆ ప్రతిపాదన విరమించుకుని గతంలో ఆమోదించిన ఆకృతుల్లోనే నిర్మాణాన్ని కొనసాగించాలని తితిదే తేల్చింది. గరుడవారధితో పాటు ఇదే ప్రాజెక్టులో ఉన్న 27కి.మీ స్మార్ట్‌స్ట్రీట్‌ ప్రాజెక్టును తప్పించాలని సూచించడంతో రూ.90 కోట్ల విలువైన పనులను పూర్తిగా నిలిపివేశారు. దాంతో తితిదేకి రూ.60 కోట్లు, స్మార్ట్‌సిటీ లిమిటెడ్‌కు రూ.30 కోట్లు విలువైన పనులు రద్దయ్యాయి.

రూ.50 కోట్లతో ఏడాది పనులు సాధ్యమా?

ప్రస్తుతం తితిదే వాటాగా చెల్లించాల్సిన రూ.400 కోట్లలో తొలి విడతగా రూ.50 కోట్ల వరకు సర్దుబాటు చేసేందుకు అంగీకరించి.. 2021-22 వార్షిక సంవత్సరంలో ఇస్తామని తితిదే పాలకమండలి అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. రెండేళ్లుగా పనులు ఆగకూడదన్న లక్ష్యంతో తిరుపతి స్మార్ట్‌సిటీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ తన వాటా సొమ్ము రూ.200 కోట్ల నుంచి గుత్తేదారు సంస్థకు చెల్లిస్తూ వస్తోంది. నిధులు కూడా దాదాపుగా పూర్తి కావడంతో ఇక తితిదే ఇచ్చే నిధుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. తితిదే నిధులు విడుదల చేయకపోతే మార్చి నాటికి పనులు ఆగే అవకాశం కనిపిస్తుండగా.. తొలి విడతగా తితిదే రూ.50 కోట్లకు మించి చెల్లించే అవకాశం లేకపోవడంతో వీటితో ఎన్నాళ్లు పనులు కొనసాగించగలరో తెలియడం లేదు. తితిదే వాటా చెల్లింపుల గడువు స్పష్టతపైనే వారధి నిర్మాణం ఆధారపడి ఉంటుంది.

ఆరునెలల పెంపు..?

గరుడవారధి నిర్మాణం పూర్తి చేసేందుకు నిర్దేశించుకున్న రెండేళ్ల గడువు 2021 ఫిబ్రవరి నాటికి ముగియనుంది. ఇప్పటి వరకు స్తంభాల నిర్మాణం పూర్తి కాలేదు. లీలామహల్‌ కూడలి నుంచి నందికూడలి వరకు కొంతభాగం పిల్లర్లపై సెగ్మెంట్‌లను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో నిర్మాణం గడువును మరో ఆరు నెలలు పొడిగిస్తూ ఇటీవల జరిగిన స్మార్ట్‌సిటీ పాలకమండలి సమావేశంలో తీర్మానించినట్లు తెలిసింది. వాస్తవానికి ఆరునెలల గడువుకు మించి పెంచడం నిబంధనలకు విరుద్ధం కావడంతో తొలివిడతగా ఆరు నెలలు గడువు పెంచినట్లు సమాచారం.

పనులు ఆగవు

తితిదే వాటా చెల్లింపునకు అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డి సుముఖంగా ఉన్నారు. పనులు నిరంతరం చేసేందుకు గుత్తేదారు సంస్థలతో చర్చించారు. స్మార్ట్‌సిటీ వాటా సొమ్ముతో పనులు కొనసాగుతూనే ఉంటాయి. బస్టాండ్‌ నుంచి నందికూడలి వరకు పూర్తి చేసి వచ్చే ఏడాదిలో వాహనాలను అనుమతించేందుకు పనులు వేగవంతం చేశాం. - గిరీష, కమిషనర్‌,నగరపాలక సంస్థ, తిరుపతి

ఇదీ చదవండి:

'స్వచ్ఛ సర్వేక్షన్-2021లో తిరుపతిని మొదటి స్థానంలో నిలుపుదాం'

ABOUT THE AUTHOR

...view details