భారీ వర్షాల కారణంగా తిరుమల (Rains in tirumala) కనుమ దారిలో కొండచరియలు విరిగిపడ్డాయి. రెండవ కనుమదారిలోని హరిణికి సమీపంలో రోడ్డుపై బండరాళ్లు పడ్డాయి. దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో కొండ భాగం పూర్తిగా నాని రాళ్లు, చెట్లు విరిగి పడుతున్నాయి. అప్రమత్తమైన తితిదే సిబ్బంది వాటిని ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు. వైకుంఠ క్యూలైన్లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. అలిపిరి, శ్రీవారి కాలినడక మార్గాలతో పాటు.. పాపవినాశనం రహదారిని తితిదే (TTD) మూసివేసింది.
జలపాతంలా మెట్ల మార్గం..
తిరుమలలో కురుస్తున్న భారీ వర్షాలకు అలిపిరి నడక మార్గం నీటి ప్రవాహంతో ప్రమాదకరంగా మారింది. అటవీ ప్రాంతం నుంచి భారీ స్థాయిలో వస్తున్న వరద... మెట్లపై ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నీటి ప్రవాహంతో మెట్ల మార్గం జలపాతంలా కనిపిస్తోంది. ఇప్పటికే ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్న తితిదే.. నడక మార్గంలో భక్తులను అనుమతించడం లేదు. దీనివల్ల పెద్ద ప్రమాదమే తప్పింది. కొండ పైనుంచి వస్తున్న నీటితో కపిలేశ్వరాలయం వద్ద జలపాతం జోరుమీదుంది.
జలమయమైన తిరుపతి
తిరుపతిని భారీ వర్షాలు ముంచెత్తాయి. నగరమంతా ఎటుచూసినా వర్షపు నీరే దర్శనమిస్తోంది. ప్రధాన కూడళ్లలో భారీగా వరద నీరు నిలవడంతో.. వాహనదారులు, ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. నగరంలోని ప్రధాన ప్రాంతాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిన పరిస్థితి కనిపిస్తోంది. తిరుపతి వెళ్లే భక్తులు, స్థానికులకు అవస్థలు తప్పడం లేదు. నగరంలోని ప్రధానమైన లక్ష్మీపురం కూడలిలో భారీగా నీరు నిలవడంతో..ఆ ప్రాంతం గుండా రాకపోకలు పూర్తిగా నిలిచాయి. దేవేంద్ర థియేటర్ కూడలి, కరకంబాడి రోడ్డు, తిరుచానూరు రోడ్డు జలమయమయ్యాయి. వెస్ట్ చర్చి, ఈస్ట్ రైల్వే స్టేషన్ అండర్ బ్రిడ్జ్‌లు నీట మునగడంతో నగరంలో జనజీవనం స్తంభించింది. అనేక చోట్ల వాహనాల రాకపోకల్ని మళ్లించారు. ఎడతెరిపి లేని వానలతో నగరంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. నగరప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కపిలతీర్థం, మాల్వాడి గుండం జలపాతాలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి.వరదఉద్ధృతికి కపిలతీర్థం ఆలయంలో2 రాతిస్తంభాలు కూలిపోయాయి. వేణుగోపాలస్వామి ఆలయ ప్రధాన మండపంలో పైకప్పుతో పాటు గోడ కూలిపోయింది.ప్రధాన రహదారులు నీటమునిగి రాకపోకలు ప్రమాదకరంగా మారాయి.
తిరుపతిప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలోఆగిన వైద్యసేవలు