ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వరద బాధితులకు నేటి నుంచి ఆర్థిక సాయం పంపిణీ - hyderabad floods updates

హైదరాబాద్​లో భారీ వర్షాలు, వరదలతో బాధితులుగా మారిన వారికి తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేయనుంది. అందుకు సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేసింది. నేటి నుంచి వారం రోజుల్లో సాయం అందించాలని స్పష్టం చేసింది.

వరద బాధితులకు నేటి నుంచి ఆర్థిక సాయం పంపిణీ
వరద బాధితులకు నేటి నుంచి ఆర్థిక సాయం పంపిణీ

By

Published : Oct 20, 2020, 10:09 AM IST

హైదరాబాద్ నగరంలో వర్షాలు, వరదల ప్రభావానికి గురైన కుటుంబాలకు ఇవాళ్టి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికసాయాన్ని అందించనుంది. ఇంటింటికీ వెళ్లి సాయాన్నిఅందించాలన్న ప్రభుత్వం... కుటుంబ, భౌగోళిక వివరాలను యాప్​లో పొందుపర్చాలని అధికారులకు స్పష్టం చేసింది. వరద ప్రభావానికి గురైన ఏ ఒక్కరికీ సాయం అందకుండా ఉండరాదని స్పష్టం చేసింది. వారం రోజుల్లో ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపింది.

ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలతో నగరంలో వరద ప్రభావానికి గురైన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం పదివేల రూపాయల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. సాయం అందించేందుకు ముఖ్యమంత్రి సహయనిధి నుంచి రూ.550 కోట్లు పురపాలకశాఖకు విడుదల చేశారు. ఆర్థికసాయాన్ని ఇవాళ్టి నుంచే అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. అందుకు అనుగుణంగా విధివిధానాలను పురపాలక శాఖ ప్రకటించింది.

ప్రత్యేకాధికారులు, జీహెచ్ఎంసీ, రెవెన్యూ లేదా ఇతర శాఖల అధికారులతో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసి వారి ద్వారా సాయాన్ని అందించాలని ప్రభుత్వం తెలిపింది. మురికివాడలు సహా ఇతర ప్రాంతాల్లో వరద ప్రభావానికి గురైన కుటుంబాలకు సాయం అందించాలని సూచించింది. ఏ ఒక్క బాధితులకు సాయం అందకుండా ఉండరాదని స్పష్టం చేసింది. ఇళ్ల వద్దకే వెళ్లి సాయం చేయాలని సూచించిన ప్రభుత్వం.. యాప్​లో కుటుంబ వివరాలతో పాటు ఆ ఇంటి భౌగోళిక వివరాలు నమోదుచేయాలని సూచించింది. ఆధార్, రేషన్ కార్డు వివరాలు నమోదు చేయాలని సూచించింది.

ఆర్థికసాయం అందించే ప్రక్రియలో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని, ఎలాంటి డూప్లికేషన్​కు తావు లేకుండా ఒకేమారు సాయం అందేలా చూడాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. నగదు ఇచ్చిన తర్వాత రసీదుపై కుటుంబ యాజమాని సంతకంతో పాటు ముగ్గురు అధికారుల ధ్రువీకరణ సంతకాలు విధిగా ఉండాలని తెలిపింది.

జీహెచ్ఎంసీ పరిసరాల్లో ఉన్న ఇతర నగర, పురపాలికల్లో ఇదే తరహాలో ముగ్గురు అధికారుల కమిటీలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లకు తెలిపింది. ఆర్థికసాయం దుర్వినియోగం కాకుండా సరిగ్గా అందేలా చూడడం ప్రత్యేకాధికారి బాధ్యత అన్న ప్రభుత్వం... ప్రక్రియను పర్యవేక్షించాలని జీహెచ్ఎంసీ కమిషనర్, పురపాలకశాఖ సంచాలకులను ఆదేశించింది. మొత్తం ప్రక్రియను వారం రోజుల్లోపు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details