తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని శాస్త్రోక్తంగా దీపావళి ఆస్థానాన్ని నిర్వహించారు. ఏటా ఆశ్వయుజ మాసం అమావాస్య రోజున శ్రీవారికి సుప్రభాతం నుంచి మొదటిగంట నివేదన వరకూ కైంకర్యాలను యథావిధిగా జరిపారు. అనంతరం బంగారు వాకిలి ముందున్న ఘంటా మండపంలో దీపావళి ఆస్థానాన్ని నిర్వహించటం సంప్రదాయంగా వస్తోంది.
ఆస్థానంలో భాగంగా ఉభయ దేవేరులతో మలయప్ప స్వామిని సర్వభూపాల వాహనంపై ఘంటా మండపంలో వేంచేపు చేశారు. స్వామివారికి ప్రత్యేక పూజ, హారతి, ప్రసాద నివేదాలను ఆగమోక్తంగా నిర్వహించారు. సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకూ శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొని 4 మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించనున్నారు. దీపావళి ఆస్థానాన్ని పురస్కరించుకుని నేడు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, బ్రహ్మోత్సవం ఆర్జిత సేవలను తితిదే రద్దు చేసింది. కరోనా మహమ్మారి నుంచి మానవాళిని కాపాడేలా చూడమని స్వామి వారిని కోరుకున్నట్లు తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.