తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు కాలినడకన వెళ్తున్న భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రిలయన్స్ సంస్థ విరాళంతో అలిపిరి కాలినడక మార్గాన్ని ఆధునికీకరించడానికి తితిదే చర్యలు చేపట్టింది. రూ.25 కోట్లతో చేపట్టిన కాలినడక మార్గ అభివృద్ధి పనులను ఇటీవలే తితిదే ప్రారంభించింది. తిరుపతి అలిపిరి తనిఖీ ప్రాంతం నుంచి కాలినడక మార్గంలో ఉన్న పైకప్పు తొలగించే పనులు కొనసాగుతున్నాయి. ఓ వైపు భక్తులను కాలినడక మార్గంలో అనుమతిస్తూనే మరో వైపు నిర్మాణాలు చేపట్టడంతో సమస్యగా ఉంది. పైకప్పు కూల్చివేత పనులు సాగుతుండటంతో శ్రీవారిని దర్శించుకొనేందుకు వచ్చే భక్తులను దారి మళ్లిస్తున్నారు. భద్రతా సిబ్బంది ద్వారా కాలినడక మార్గం పక్కనే ఉన్న కొండదారిలో వెళ్లాల్సిందిగా సూచిస్తున్నారు. రాళ్లు రప్పలతో కూడిన ప్రాంతంలో భక్తులు నడవటానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కాలినడక మార్గంలో నిర్మాణాలు జరుగుతున్న సమచారం భక్తులకు తెలిసేలా ప్రారంభంలో ఎలాంటి బోర్డులు ఏర్పాట్లు చేయలేదు. కాలినడకన తిరుమల యాత్ర ప్రారంభించిన భక్తులు కొంత దూరం వెళ్లాక నిర్మాణాలు జరుగుతున్న తీరు....కొండ మార్గంలో నడవాల్సి రావడాన్ని గుర్తిస్తున్నారు. అప్పటికే కొంత దూరం ప్రయాణించిన భక్తులు రాళ్లు రప్పల్లో నడవలేక...వెనక్కు తిరిగి వెళ్లలేక సతమతమవుతున్నారు. అలిపిరి ప్రారంభంలో రహదారి నిర్మాణంలో ఉన్న సమాచారాన్ని తెలిపేలా బోర్డులు ఏర్పాట్లు చేస్తే ఇబ్బందులు పడేవారం కాదని భక్తులు అంటున్నారు.