తిరుమల శ్రీవారి దర్శనం, ప్రసాదం, గదుల విషయంలో మోసాలకు పాల్పడుతూ భక్తులను దోచుకుంటున్న దళారులపై వేట కొనసాగుతోంది. భక్తులను మోసగిస్తున్న వారిపై తితిదే విజిలెన్స్ కన్నెర్ర చేస్తోంది. శ్రీవారి దర్శన టిక్కెట్లు, గదులు, ప్రసాదాలు... ఇలా అన్ని చోట్లా నిఘా పటిష్ఠం చేశారు. మోసగాళ్ల సమాచారం కోసం వినూత్నంగా ప్లకార్డులతో ప్రచారం చేస్తున్నారు. దళారులకు సహకరిస్తున్న తితిదే ఉద్యోగుల పైనా.. చర్యలు చేపట్టారు.
ప్రముఖుల పేరుతో..
ఇప్పటి వరకూ.. 200 మందికిపైగా దళారులను పట్టుకుని వారిపై చర్యలు తీసుకున్నారు. చోడవరం ఎమ్మెల్యే పీఆర్వోగా తిరుమలలో పనిచేస్తున్న కల్లూరి రాజు..... తెలంగాణకు చెందిన ఓ ఎమ్మెల్సీ సిఫార్సు లేఖతో వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లను పొందాడు. తెలంగాణలోని కరీంనగర్ భక్తులకు అధిక ధరకు విక్రయించాడు. గత నెల గూడూరు ఎమ్మెల్యే సిఫార్సు లేఖపై శ్రీనివాసులు అనే దళారి వీఐపీ బ్రేక్ దర్శనం టిక్కెట్లను పొంది చెన్నై, బెంగళూరుకు చెందిన ఐదుగురు భక్తులకు 35 వేల రూపాయలకు విక్రయించాడు. ఇందులో తితిదే ఉద్యోగులతోపాటు పొరుగు సేవల సిబ్బంది పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించి చర్యలు తీసుకుంటున్నారు.