Cyber Crime Offender Arrest : చిత్తూరు పట్టణంలోని దుర్గానగర్ కాలనీలో సందీప్ కిషోర్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ఆయన ఇన్సూరెన్స్ పాలసీలు కట్టి.. అనివార్య కారణాలతో వాటిని మధ్యలోనే అపేశాడు. ఈ విషయాన్ని సైబర్ నేరగాళ్లు గుర్తించారు. సందీప్ కిషోర్ కు ఫోన్ చేసి, తాము ఆర్బీఐ నుంచి మాట్లాడుతున్నామని పరిచయం చేసుకున్నారు. నిలిపివేసిన పాలసీల గురించి ఆరా తీశారు. ఫోన్ చేసింది ఆర్బీఐ వారేనని నమ్మిన సందీప్ వారికి వివరాలు తెలిపాడు.
ఆ సైబర్ కేటుగాళ్లు నిలిపివేసిన ఇన్సూరెన్స్ పాలసీలకు తాము 35 లక్షల రూపాయలు చెల్లిస్తామని చెప్పి ఇందుకోసం జీఎస్టీ కింద నగదు చెల్లించాలని సందీప్ ని కోరారు. వారి మాయమాటలు నమ్మిన సందీప్ కిషోర్ పలుమార్లు రూ. 20 లక్షల రూపాయలు చెల్లించాడు. ఎంతకీ తనకు రావల్సిన మొత్తం ఖాతాలో జమ కాకపోవడంతో మోసపోయానని గ్రహించాడు. వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. సందీప్ కిషోర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారించిన చిత్తూరు టూ టౌన్ పోలీసులు నోయిడాకు చెందిన శైలేంద్ర సింగ్ ను అరెస్టు చేశారు. ఇంకా మరికొందరిని అరెస్టు చేయాల్సి ఉందని డీఎస్పీ తెలిపారు.