బావిలో ఈతకు దిగి ఇద్దరు విద్యార్థులు మృతి
బావిలో ఈతకు దిగి ఇద్దరు విద్యార్థులు మృతిచెందిన ఘటన అనంతపురం జిల్లా ధర్మవరం మండలం రాంపురంలో చోటుచేసుకుంది. బావి నుంచి విద్యార్థుల మృతదేహాలను.. స్థానికుల సహాయంతో పోలీసులు వెలికితీశారు. మృతులను 9వ తరగతి విద్యార్థులు నిషాంత్, కార్తీక్‌రెడ్డిగా గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసి వారు దర్యాప్తు చేస్తున్నారు.
పశ్చిమగోదావరి జిల్లాలో టోల్‌ప్లాజా వద్ద గంజాయి పట్టివేత
పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం కలపర్రు టోల్‌ప్లాజా వద్ద భారీగా గంజాయి పట్టుబడింది. నిందితులు కారులో అక్రమంగా తరలిస్తున్న 400 కిలోల గంజాయిని అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.
కడప జిల్లాలో ఎర్రచందనం పట్టివేత.. ముగ్గురు అరెస్ట్
కడప జిల్లా రైల్వేకోడూరు మండలం సెట్టిగుంట వద్ద అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు రూ. 7 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
ఆర్టీసీ బస్సును అడ్డగించి డ్రైవర్‌పై దాడి
ఆర్టీసీ బస్సును అడ్డగించి డ్రైవర్‌పై దాడి చేసిన ఘటన అనంతపురం జిల్లా యాడికి మండలం చిక్కేపల్లిలో చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సును తమ కోసం ఆపలేదని కక్షతో ఇద్దరు వ్యక్తులు బైక్ పై బస్సును వెంబడించి దాడికి పాల్పడ్డారు. ఘటనపై సదరు డ్రైవర్ యాడికి స్టేషన్లో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
హైటెన్షన్ తీగలు తగిలి వ్యక్తి మృతి
ప్రకాశం జిల్లా తాళ్లూరు మండసం కొర్రపాటివారిపాలెంలో పొక్లెయినర్‌కు హైటెన్షన్ తీగలు తగిలి అనిల్ అనే ఆపరేటర్ మృతి చెందాడు. లారీపై పొక్లెయినర్ తరలిస్తుండగా టైరు పేలింది. అది గమనించి కిందకు దిగుతుండగా..హైటెన్షన్ తీగలు ఆ వ్యక్తికి తాకడంతో ఈ విషాదం జరిగింది.
డ్రగ్స్ కేసులో నైజీరియన్ అరెస్ట్..
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం డ్రగ్స్ కేసులో నైజీరియన్ అరెస్ట్ అయ్యాడు. యువకులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న పీటర్ వాజకోనును భీమవరం పోలీసులు బెంగళూరులో అరెస్టు చేశారు. డ్రగ్స్ కేసులో ఇప్పటివరకు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.
బాలిక ఆత్మహత్యకు కారణం అతనేనా?
విజయవాడలో బాలిక ఆత్మహత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. బాలిక రాసిన ఆత్మహత్య లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాలిక ఇంటి వద్ద వినోద్ అనే వ్యక్తి వేధించినట్లు పోలీసులకు సమచారం ఉన్నట్లు తెలుస్తోంది. వేధింపుల కోణంలో భవానీపురం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తిరుపతి సమీపంలో వ్యక్తి దారుణ హత్య..
తిరుపతి సమీపంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పేరూరు సమీపంలో గాంధీపురం బైపాస్ రోడ్డు వద్ద గుర్తు తెలియని దుండగులు ఆ వ్యక్తిని కత్తులతో పొడిచి చంపి పరారయ్యారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు ఉప్పరపల్లి వద్ద గల వినాయక నగర్‌కు చెందిన సుహానా భాషాగా గుర్తించారు. భాషా జనసేన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడని స్థానికులు చెపుతున్నారు. పాత కక్షల నేపథ్యంలో హత్య జరిగిందా.. ? లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హంతకులు వదిలి వెళ్లిన ద్విచక్రవాహనం కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొన్న ఎం.ఆర్ పల్లి పోలీసులు విచారణ చేస్తున్నారు. మృతుడికి భార్య, ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నట్లు తెలిపారు. జనసేన నాయకులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రగాఢ సానుభూతి తెలిపారు. త్వరితగతిన విచారణ జరిపి హంతకులను అరెస్ట్ చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వారు కోరారు. పూర్తి వివరాలను దర్యాప్తు అనంతరం తెలుపుతామని పోలీసులు చెబుతున్నారు.
విశాఖలో రిస్టార్ట్పై దాడి.. అదుపులో 22 మంది నిందితులు..
విశాఖ జిల్లా భీమిలిలోని రిసార్ట్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు చేపట్టారు. 22 మంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారి వద్ద నుంచి రూ.25 లక్షల విలువైన 321 కాయిన్లు, రూ.5.7 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. పేకాటరాయుళ్లలో విశాఖకు చెందిన ప్రముఖులు ఉన్నట్లు సమాచారం. నిందితులకు చెందిన 9 కార్లు, 23 సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
గుడివాడలో రెండు వేరు వేరు ప్రమాదాల్లో నలుగురికి గాయాలు..
కృష్ణాజిల్లాలో జరిగిన మూడు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఒకరు చనిపోగా..మరో ఐదుగురు గాయాల పాలయ్యారు. మచిలీపట్నం వైపు నుంచి గుడివాడ వస్తున్న కారు బోల్తా పడటంతో న్యాయవాది, అతని కుమారుడికి గాయాలయ్యాయి. మోపిదేవి వద్ద 216 జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గుంటూరు జిల్లా ఐలవరం గ్రామానికి చెందిన తాత నాగలక్ష్మి అక్కడిక్కడే మృతి చెందింది. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!
వేగంగా దూసుకొచ్చిన కారు అదుపు తప్పడంతో జరిగిన ప్రమాదంలో కారు మూడు పల్టీలు కొట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. రోడ్డుకు అడ్డంగా తిరగబడిన కారును క్రేన్ సహాయంతో పోలీసులు పక్కకు తీసి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. రెండు బైకులు ఢీకొని అదే ప్రాంతంలో జరిగిన మరో ప్రమాదంలో ఇరువురు యువకులకు తీవ్రగాయాలు అయ్యాయి. ప్రమాదంలో రసూల్ అనే తాపీ కార్మికుడికి కాలు విరగడంతో పాటు తీవ్ర గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసిన గుడివాడ టూ టౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాళాలు వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న దొంగ అరెస్ట..
తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఘరానా దొంగ శ్రీనివాసులును అనంతపురం నాలుగో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. అదనపు ఎస్పీ నాగేంద్రుడు మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. నిందితుడు శ్రీనివాసులు బేల్దారి పని చేసుకుంటూ జీవనం సాగించేవాడు. పేకాట ఇతర వ్యాసానాలకి బానిసై అప్పులు చేయసాగాడు. అప్పులు తీర్చడానికి తాళం వేసి ఇళ్లను టార్గెట్ చేసుకుని చోరీలకు పాల్పడే వాడని పోలీసులు వెల్లడించారు. ఇప్పటి వరకు 29 ఇళ్లలో శ్రీవాసులు చోరీలకు పాల్పడినట్లు అనంతపురం పోలీసులు వెల్లడించారు. శ్రీనివాసులు నుంచి సుమారు 24 లక్షల విలువచేసే 52 తులాల బంగారు, 800 గ్రాముల వెండి, ఒక ద్విచక్రవాహం, రెండు ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
భార్య, భర్తలు గంజాయి తరలిస్తూ..
తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలోని బోడిపాలెం వంతెన వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ కారులో అక్రమంగా తరలిస్తున్న గంజాయి, మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని భార్య, భర్తలను అరెస్టు చేసినట్లు అమలాపురం డీఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. నరసాపురం మండలానికి చెందిన చెక్క వీర వెంకట సత్యనారాయణ, కృష్ణవేణిలు కారులో 4.45 కేజీల గంజాయితో పాటు.. 15 మద్యం సీసాలు తరలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. దొంగ నోట్లుగా తీసుకువెళ్తున్న నల్లని కాగితాలు రసాయన సీసాలను సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. రాజోలు సమీపంలో తక్కువ నగదుకు ఎక్కువ దొంగ నోట్లు ఇస్తామని నమ్మించి రూ. 5 లక్షలు కాజేసిన కేసులో వారి వద్ద ఉన్న రూ. 2.95 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
లారీ క్యాబిన్లో రహస్య గది..
మరో ఘటనలో గంజాయి అక్రమంగా తరలిస్తున్న ముఠాను పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు పోలీసులు అరెస్టు చేశారు. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం ఏజెన్సీ నుంచి గాజువాకకు చెందిన రాయుడు శ్యామ్, మహారాష్ట్రకు చెందిన దేవి దశ శంకర్, డాక్టర్ చంగాదేవ్లు లారీ క్యాబిన్లో రహస్య గది ఏర్పాటు చేసి 420 కేజీలు గంజాయిని తరలిస్తున్నారు. వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులు గంజాయిని, లారీని స్వాధీనం చేసుకొని నిందితులను అరెస్టు చేశారు.
పేకాట శిబిరంపై దాడి..
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలంలో పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు. ఏడుగురు జూదరులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 23,690 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై సురేష్ తెలిపారు.
రూ.16 లక్షల విలువైన గంజాయి పట్టివేత
విజయనగరం జిల్లా ఎస్.కోటలో 420 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. మూడు చోట్ల దాడి చేసి మెుత్తం 9 మంది నిందితులను అరెస్టు చేశారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.16 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.
ఇదీ చదవండి:Car Accident at Karimnagar: గుడిసెల్లోకి దూసుకెళ్లిన కారు..నిద్రిస్తున్న నలుగురు దుర్మరణం