అంతర్జాతీయ స్ధాయిలో ముడి చమురు ధరలు తగ్గుతుంటే.. దేశంలో మాత్రం పెట్రోల్, డీజిల్ చార్జీలు విపరీంతగా పెరుగుతున్నాయని సీపీఐ(CPI) జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. పన్నుల పేరుతో ప్రజలను దోచుకొంటున్నాయని మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ.. సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక తిలక్ రోడ్డులోని ఓ పెట్రోల్ బంక్ వద్ద అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ.. ద్విచక్ర వాహనాలలో పెట్రోల్ పోశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పన్నుల భారం పెంచుతున్నాయని... అసమర్థ ప్రధాని మోదీ(PM MODI) .. కార్పొరేట్ సంస్థలతో లాలూచీ పడ్డారని ఆరోపించారు. మోదీ గడ్డం పెరిగినట్లు చమురు ధరలు పెరుగుతున్నాయని.. పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ(GST) పరిధిలో ఎందుకు చేర్చడం లేదని ప్రశ్నించారు.