ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'లంబోదరుడు అమ్ముడైతేనే.. మా విఘ్నాలు తొలగిపోతాయి'

వినాయకుడు... సర్వ విఘ్నాలు తొలగించి ప్రజలకు సుఖ శాంతులు కలిగిస్తాడని భక్తులు విశ్వసిస్తారు. అలాంటిది ఆ ఏకదంతుడి విగ్రహాలు తయారు చేసే ఈ కార్మికుల పరిస్థితి మాత్రం.. కరోనా కారణంగా దయనీయంగా తయారైంది. విగ్రహాల తయారీపైనే ఆధారపడిన కొన్ని వేల కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వినాయక ప్రతిమల తయారీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తిరుపతి బొమ్మల క్వార్టర్స్‌లోని కుటుంబాలు అర్ధాకలితోనే కాలం వెళ్లదీస్తున్నాయి.

corona virus having serious impact on the makers of Ganesh idols makers
corona virus having serious impact on the makers of Ganesh idols makers

By

Published : Jul 11, 2020, 6:23 PM IST

ఇప్పటికే రంగులు పూర్తయి...కళకళలాడాల్సిన గణపయ్య విగ్రహాలన్నీ ప్రస్తుతం సున్నం పూతతోనే ఆగిపోయాయి. ఎవరో ఒకరు రాకపోతారా... ఒక్క విగ్రహమైనా కొనకపోతారా అన్న ఆశతో అక్కడి కళ్లన్నీ దీనంగా ఎదురు చూస్తున్నాయి. సంవత్సరం పాటు పడిన కష్టమంతా వృథా అవుతుంటే ఏం చేయాలో పాలుపోని స్థితిలో విగ్రహ తయారీ కార్మికులు ఉన్నారు.

ఆధ్యాత్మిక నగరి తిరుపతిలోని బొమ్మల క్వార్టర్స్ అంటే వినాయక విగ్రహాలకు ప్రసిద్ధి. రాష్ట్రంలో మిగిలిన గణపతి విగ్రహాల తయారీ పరిశ్రమలకు భిన్నంగా కాగితం గుజ్జుతో లంబోదరుడి విగ్రహాలు తీర్చిదిద్దటం ఇక్కడి ప్రత్యేకత. కొన్ని దశాబ్దాల క్రితం తమిళనాడులోని పలు ప్రాంతాల నుంచి తిరుపతికి వచ్చిన వీరంతా.. గణనాయకుడి విగ్రహాల తయారీనే జీవనోపాధిగా మార్చుకున్నారు.

అప్పులు చేసి... విగ్రహాలు తయారుచేసి

తిరుపతిలోని ఈ విగ్రహాల తయారీ పరిశ్రమపై ఆధారపడి 100 కుటుంబాలు జీవిస్తున్నాయి. విగ్రహాలు తయారీ కోసం ఒక్కో కుటుంబం నాలుగు నుంచి పది లక్షల రూపాయల వరకూ బ్యాంకుల నుంచి రుణాలు పొందుతాయి. ప్రత్యేకంగా మహిళా సంఘాల నుంచి రుణాలు తీసుకునే అవకాశం ఉంటుంది. వీరికి రుణ సదుపాయాన్ని బ్యాంకులు తేలికగానే కల్పిస్తాయి. వచ్చిన డబ్బుతో... విగ్రహాలు తయారు చేసి వాటిని విక్రయిస్తుంటారు. అనంతరం రుణాలు తిరిగి చెల్లించే ఆనవాయితీ కొన్ని దశాబ్దాలుగా వస్తోంది. అలానే గతేడాది నవంబర్- డిసెంబర్ సమయంలో బ్యాంకుల నుంచి రుణాలు పొందిన వీళ్లంతా ముడి సరుకులను పొరుగు రాష్ట్రాల నుంచి తెప్పించుకున్నారు. విగ్రహాల తయారీని ప్రారంభించారు. ప్రస్తుతానికి ఆర్డర్లు రాక వీళ్లంతా రుణభారంలో మునిగిపోవాల్సి వచ్చింది.

షెడ్డు దాటట్లేదు

కరోనా కారణంగా ఈ ఏడాది వినాయకుని విగ్రహాలు పెట్టకూడదని చాలా ఉత్సవ కమిటీలు ఇప్పటికే నిర్ణయం తీసేసుకున్నాయి. ఫలితంగా... ఈపాటికి రంగులను అద్దటం పూర్తై కళకళలాడాల్సిన వినాయకుడి విగ్రహాలన్నీ అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. కాగితం గుజ్జుతో తయారు చేసిన పర్యావరణ హితమైన బొమ్మలు కావటం వల్ల వర్షాలకు తడిసిపోయి ఎక్కడిక్కడ విరిగిపోతున్నాయి. వీటిని మరో సంవత్సరం పాటు షెడ్డులోనే ఉంచినా ఎందుకు పనికిరాకుండా పోతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తయారీ దారులు.

ఆదాయం ఆవిరి

100 కుటుంబాలకు గాను బ్యాంకుల నుంచి, పొదుపుల సంఘాల నుంచి, బంగారం, నగలు తాకట్టుపెట్టి తీసుకున్న మొత్తం రుణం సుమారు 6 కోట్ల రూపాయలుగా ఉంది. పరిస్థితులు సాధారణంగా ఉంటే దాదాపుగా ఈ పాటికే 10 వేల విగ్రహాలు పూర్తి చేసేవారు. చిత్తూరు జిల్లానే కాకుండా, కడప, నెల్లూరు జిల్లాలతో పాటు తమిళనాడులోని సరిహద్దు ప్రాంతాలన్నింటికి బొమ్మలను తయారు చేసి అందించే వాళ్లు. తద్వారా ఒక్కో కుటుంబానికి రెండు నుంచి మూడు లక్షల రూపాయల ఆదాయం వచ్చి వాటినే తిరిగి సంవత్సరమంతా తమ కుటుంబ పోషణ కోసం వినియోగించుకొనేవారు. ఈ ఆదాయమంతా ఆవిరైపోయిందని... ఆవేదనం వ్యక్తం చేస్తున్నారు కార్మికులు.

ఇదే తొలిసారి

ఊహించని రీతిలో తమ జీవితాలను కరోనా మహమ్మారి ఛిన్నాభిన్నం చేసిందంటున్నారు వీరంతా. తాత ముత్తాతల కాలం నుంచి విగ్రహాల తయారీలో నష్టాలు చూసిందే లేదని చెబుతున్నారు. ప్రభుత్వం రుణమాఫీ చేసి ఆదుకోవాలని కోరుతున్నారు. ఇప్పటికే విగ్రహాల తయారీకి చేసిన లక్షల రూపాయల అప్పుల్ని తిరిగి తీసుకు వచ్చి కట్టే స్తోమత, శక్తి తమకూ లేదంటూ నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి:

కరోనా నుంచి కోలుకునేందుకు.. ధైర్యమే శ్రీరామ రక్ష!

ABOUT THE AUTHOR

...view details