కరోనా (కొవిడ్-19) వైరస్ ప్రభావం మొదలైన తొలిరోజుల్లో పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవీ) ల్యాబ్‌లో మాత్రమే రోగ నిర్ధారణ జరిగేది. అనుమానిత కేసులు ఎక్కువైపోతున్నందున పరీక్షా కేంద్రాల సంఖ్యను కేంద్రం పెంచుతూ వస్తోంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా 18 కేంద్రాలున్నా ఏపీలో ఒక్కటీ లేదు. ఆంధ్రప్రదేశ్‌లో అనుమానిత కేసులు కనిపిస్తే నమూనాలను సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి పంపుతున్నారు. అక్కడ పాజిటివ్ అని వస్తే పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపిస్తున్నారు. పుణెలోనూ నిర్ధారణ అయితేనే అధికారికంగా ప్రకటిస్తారు. ఇటీవల కేంద్ర బృందం విశాఖ వచ్చినప్పుడు అక్కడి వైద్యాధికారులు రాష్ట్రంలోనే పరీక్షల నిర్ధారణకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలో తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలోని ప్రయోగశాల సామర్థ్యంపై అంచనా వేసిన అనంతరం కేంద్రం సానుకూలత వ్యక్తం చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
మంజూరై మూడేళ్లయినా...
మూడేళ్ల కిందట గుంటూరు ప్రభుత్వ బోధనాసుపత్రిలో రాష్ట్ర స్థాయి వైరాలజీ ల్యాబ్‌ను కేంద్రం మంజూరు చేసింది. దాని నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు రాష్ట్రం నుంచి సకాలంలో పంపలేదు. ప్రస్తుతం ఈ ప్రయోగశాలలో కరోనా నిర్ధారణకు అవసరమైన పరికరాలు, సుశిక్షితులైన సిబ్బంది లేని కారణంగా రాష్ట్రంలోని బోధనాసుపత్రుల నుంచి నమూనాలు సేకరించి సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి పంపాల్సి వస్తోంది. ఇకపై తిరుపతి స్విమ్స్‌లో పరీక్షలు జరగబోతున్నందున సమయం ఆదా కానుంది.
పుణెలో నమోదు తప్పనిసరి...
దేశంలో 18 కేంద్రాల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. అయితే వీటిలో వ్యాధి నిర్ధారణ జరిగినా ఆ సమాచారాన్ని పుణెకు పంపాలి. అక్కడ మరింత లోతుగా విశ్లేషించి నివేదిక ఇస్తారు. వీటి ఆధారంగానే కేంద్రం రాష్ట్రాలను అప్రమత్తం చేస్తుంది.
ఫలితం ఇలా ఇస్తారు...