ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వెలవెలబోతున్న తిరుపతి నగరం... ఉపాధి కోల్పోయిన వ్యాపారులు - తిరుపతిలో కరోనా ప్రభావం

శ్రీవారి పాదపద్మాల చెంత ఉన్న తిరుపతి పరపతి క్రమంగా తగ్గిపోతోంది. నిత్యం లక్ష మంది భక్తుల రాకపోకలతో సందడిగా కనిపించే నగరం ప్రస్తుతం వెలవెలబోతోంది. భక్తుల ఆధారంగా నడుస్తున్న వివిధ రంగాలు కరోనాతో కోలుకోని స్థితిలో ఉన్నాయి.

కరోనాతో అన్నిరంగాలు కుదేలు
కరోనాతో అన్నిరంగాలు కుదేలు

By

Published : Jun 16, 2020, 6:42 PM IST

నిత్యం లక్షలాది మంది భక్తుల రాకపోకలతో సందడిగా కనిపించే తిరుపతి నగరం ప్రస్తుతం వెలవెలబోతోంది. భక్తుల ఆధారంగా నడుస్తున్న వివిధ రంగాలు తీవ్రంగా నష్టపోయాయి. ఫలితంగా ఉపాధి కోల్పోయి వేలాది మంది వీధినపడ్డారు. రుణాలిచ్చిన సంస్థలు, వడ్డీ వ్యాపారులకు రికవరీలేక అయోమయంతో ఉండిపోయారు. తిరునగరికి పూర్వ వైభవం రావాలని స్థానికులు ఆశిస్తున్నారు.

రోడ్డెక్కని ట్యాక్సీలు, ఆటోలు

ట్యాక్సీలు, ఆటోలు పూర్తిస్థాయిలో కదలలేదు. తిరుపతిలో ఇన్నోవాలు, జీపులు ఇతరత్రా నాలుగు చక్రాల వాహనాలు 3 వేలకుపైగా ఉన్నాయని, వీటిలో 20 శాతం కూడా రోడ్డెక్కలేని స్థితిలో ఉన్నాయని ట్యాక్సీల నిర్వాహకులు నరేంద్ర తెలిపారు. వీటికి ఈఎంఐలు కట్టలేక, ఫైనాన్స్‌ సంస్థల వేధింపులు భరించలేక నలిగిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటోలు 20 వేలకు పైగా ఉండగా వీటిలోనూ 3 వేల వరకు కూడా రోడ్డుపైకి రావడంలేదు. ప్రయాణికులు లేకపోవడం, కరోనా భయంతో రోడ్డుపైకి తీసుకురాలేక పోతున్నారు. దాదాపు 10 వేల మంది వరకు జీవనోపాధి పొందుతుండగా ప్రస్తుతం కుటుంబ పోషణ భారమైంది.

ఆదరణ లేని దుకాణాలు

నిత్యావసర వస్తువుల దుకాణాలు మినహా.. వస్త్ర, బంగారం, ఆటోమొబైల్‌ తదితర దుకాణాలు వెలవెలబోతున్నాయి. తిరుపతిలో బంగారం దుకాణాలు చిన్న, పెద్దవి కలిపి 56 వరకు ఉన్నాయి. వీటిలో నిత్యం రూ.లక్షల్లో వ్యాపారం సాగుతుండగా ప్రస్తుతం రూ.వేలల్లో కూడా జరగడం లేదు. వస్త్ర దుకాణాల పరిస్థితి ప్రతికూలంగా ఉంది. ఆటోమొబైల్‌ రంగం దారుణంగా ఉంది. వీటిని నమ్ముకున్న దాదాపు 25 వేల మంది జీవనం అగమ్యగోచరంగా మారింది. వ్యాపారుల పరిస్థితి దారుణంగా ఉంది. అద్దెలు కట్టలేని స్థితిలో యజమానులు ఉన్నారు.

స్థిరాస్తి రంగం నిస్తేజం

లాక్‌డౌన్‌ కారణంగా స్థిరాస్తి రంగం కుదేలైపోయింది. కొనుగోళ్లు, అమ్మకాలు దాదాపు పూర్తిగా స్తంభించిపోయాయి. రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు వెలవెలబోతున్నాయి. నగరంలో చాలా వరకు అద్దె ఇళ్లు ఖాళీ అయ్యాయి. తిరిగి చేరే వాళ్లే కనిపించడంలేదు. ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు పోవడం, ఉపాధి రంగం కునారిల్లటంతో చాలా మంది ఖాళీ చేసి పల్లెబాట పట్టారు. అపార్ట్‌మెంట్లు, భవంతుల్లో టులెట్‌ బోర్డులు కనిపిస్తున్నాయి. నిర్మాణ రంగం కూడా దెబ్బతింది. ఆర్థిక సంక్షోభం, సిమెంటు, ఇసుక ధరలు భారీగా పెరగడం, నైపుణ్యం ఉన్న కార్మికులు స్వస్థలాలకు వెళ్లిపోవటంతో నిర్మాణాలు అరకొరగా సాగుతున్నాయి.

హోటళ్లు వెలవెల

హోటల్‌ రంగం చాలా వరకు ఆర్థికంగా నష్టపోయింది. లాక్‌డౌన్‌ సడలింపుల తర్వాత కూడా భక్తులు, పర్యాటకులు లేక వెలవెలబోతున్నాయి. హోటళ్లు, లాడ్జీలు చిన్నవి, పెద్దవి కలిపి 400పైగా ఉన్నాయి. ఈనెల 8 నుంచి హోటళ్లు తెరచుకున్నా.. గదుల నమోదు అంతంత మాత్రంగానే ఉంది. రాబడి లేకపోవటంతో నిర్వహణ భారంతో అధిక భాగం తెరచుకోలేదు.

ఇదీ చూడండి:ఆ వాహన సంస్థలో 1,000 ఉద్యోగాలు కోత!

ABOUT THE AUTHOR

...view details