లాక్‌డౌన్ తర్వాత శ్రీవారి దర్శనాలను గతనెల్లో పునఃప్రారంభించిన తితిదేలో కొన్ని రోజులుగా కరోనా కలకలం రేపుతోంది. తిరుమలలో విధులు నిర్వహిస్తున్న అర్చకులు సహా 140 మంది సిబ్బందికి కరోనా సోకడంతో..... తితిదే అప్రమత్తమైంది. ఈ విషయంపై....... అర్చకులు, ఇతర అధికారులతో ధర్మకర్తల మండలి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్... ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కైంకర్యాలు నిర్వహించే అర్చకుల్లో 14 మంది కరోనా బారిన పడ్డారని... ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు ఛైర్మన్‌కు వివరించారు. అర్చకులందరూ అర్చక నిలయంలోనే బస చేయడం, ఒకేచోట భోజన సౌకర్యాలు కల్పించడం వంటి కారణాలతో.. కరోనా విస్తృతి అధికంగా ఉంటుందన్నారు. వేర్వేరుగా వసతి కల్పించాలని కోరారు.
ఉద్యోగులు, అర్చకులు కరోనా బారిన పడడంతో శ్రీవారి దర్శనాలపైనా సమీక్షించిన తితిదే ఛైర్మన్... మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. వయసు పైబడిన అర్చకులను తిరుమల ఆలయంలో కైంకర్యాల నుంచి మినహాయించాలని ఆదేశించారు. అర్చకులకు వసతి సామూహికంగా కాకుండా ఒక్కొక్కరికి ఒక్కో గది కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. కొండపై విధులు నిర్వహిస్తున్న వారికి కరోనా సోకడానికి భక్తులు కారణం కాదన్న భావనతో... దర్శనాలు కొనసాగిస్తున్నట్లు తితిదే ఛైర్మన్ ప్రకటించారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తితిదే స్పష్టం చేసింది.