ముఖ్యమంత్రి జగన్ రేపు (సోమవారం) తిరుమల రానున్నట్లు తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ సేవ రోజున రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం పట్టు వస్త్రాలు సమర్పించనున్నారని వెల్లడించారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా తిరుపతిలో ప్రారంభించనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను అదనపు ఈవో ధర్మారెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. రెండు రోజుల పాటు తిరుపతి, తిరుమలలో పర్యటించనున్న సీఎం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారని వైవీ స్పష్టం చేశారు.
తితిదే ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్మించిన శ్రీపద్మావతి చిన్నపిల్లల హృదయాలయం, అలిపిరి కాలినడక మార్గం, గో మందిరాన్ని సోమవారం సీఎం జగన్ ప్రారంభించి తిరుమలకు చేరుకుంటారన్నారు. రాత్రి స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. మంగళవారం రోజు తిరుమలలో ఎస్వీబీసీ నూతన చానళ్లను, ఆధునిక సాంకేతికతతో నిర్మించిన బూందిపోటును ప్రారంభించి విజయవాడకు బయల్దేరుతాయని స్పష్టం చేశారు.