ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన వారికి మరణం లేదు: సీఎం - CM Jagan

దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన వారికి మరణం లేదని సీఎం జగన్ పేర్కొన్నారు. మన సైనికుల పోరాటం కొత్త దేశానికి కారణమైందని వ్యాఖ్యానించారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో 'స్వర్ణిమ్‌ విజయ్ వర్ష్‌' కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్నారు. 1971 ఇండియా-పాక్‌ యుద్ధానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.

CM Jagan Praise Indian Army in Swarnim Vijay Varsh
'స్వర్ణిమ్‌ విజయ్ వర్ష్‌' కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్

By

Published : Feb 18, 2021, 8:26 PM IST

'స్వర్ణిమ్‌ విజయ్ వర్ష్‌' కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్

మంచు, ఎండ, వర్షం.. దేశ రక్షణ కోసం ఎలాంటి సమస్యనూ మన సైనికులు పట్టించుకోరని ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి కొనియాడారు. తిరుపతిలో నిర్వహించిన స్వర్ణిమ్‌ విజయ్ వర్ష్‌ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. దేశం కోసం సరిహద్దుల్లో కాపలా కాసే సైనికులకు వందనం తెలిపారు. ప్రాణాలు లెక్క చేయకుండా దేశాన్ని కాపాడుతున్నారని వ్యాఖ్యానించారు. మృత్యు భయం వీడి మాతృభూమి సేవలో తరిస్తున్నారని పేర్కొన్నారు.

బంగ్లాదేశ్ అవతరించి ఈ ఏడాదికి 50 ఏళ్లు పూర్తవుతుందని సీఎం జగన్‌ వివరించారు. నియంత పాలనకు వ్యతిరేక పోరులోనే బంగ్లాదేశ్ ఆవిర్భావం జరిగిందన్న ముఖ్యమంత్రి... ముజిబుర్ గెలుపును ఆనాటి పాక్ పాలకులు జీర్ణించుకోలేదని వ్యాఖ్యానించారు. ముజిబుర్‌కు ప్రధాని పదవి ఇచ్చేది లేదని మొండికేశారని చెప్పారు. 1971 భారత్‌-పాక్ యుద్ధం.. ప్రపంచ చరిత్రలోనే ప్రత్యేకమని అభిప్రాయపడ్డారు.

బంగ్లాదేశ్ అనే దేశం ఉందంటే మన సైనికుల పోరే కారణని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. మన సైనికుల పోరాటం కొత్త దేశానికి కారణమైందన్న జగన్‌... మన సైనికుల దెబ్బకు యుద్ధం 13 రోజుల్లోనే ముగిసిందని వివరించారు. బంగ్లా విమోచనకు పోరాడిన వారి కోసం సైన్యమే కదిలి వచ్చిందని... మహావీరచక్ర వేణుగోపాల్‌కు వందనం అంటూ సైన్యం వచ్చిందని చెప్పారు.

సన్యాసినాయుడు, క్రిస్టఫర్ కుటుంబాలకు జాతి రుణపడిందని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. నిజమైన హీరోలను సన్మానించే కార్యక్రమంలో పాల్గొనటం అదృష్టమని పేర్కొన్నారు. జాతి కోసం పోరాడుతున్న సైనికుల కోసం అనేక చర్యలు చేపట్టామన్న ముఖ్యమంత్రి... అశోకచక్ర, పరమవీరచక్రకు రాష్ట్రం తరపున రూ.10 లక్షలు ఇస్తున్నట్టు వెల్లడించారు. ఇకనుంచి ఆ మొత్తాన్ని పదిరెట్లు పెంచి రూ.కోటి ఇస్తామని ప్రకటించారు. మహావీరచక్ర పొందినవారికి ప్రస్తుతం రూ.8 లక్షలు ఇస్తున్నామన్న సీఎం... ఇకనుంచి ఆ మొత్తాన్ని పదిరెట్లు పెంచి రూ.80 లక్షలు ఇస్తామని చెప్పారు.

వీర చక్ర, సౌర్య చక్ర ఇప్పటి వరకూ ప్రభుత్వం తరపున 6లక్షలు ఇస్తున్నామని... ఇకపైన 60లక్షలు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇస్తామని సీఎం ప్రకటించారు. సైన్యంలో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన వారికి ఇప్పటికే 50 లక్షలు ఇస్తున్నామని సీఎం జగన్ ఉద్ఘాటించారు. నాగాలాండ్​లో కోహిమాలో అమరవీరుల స్తూపంపై ఉన్న నినాదాన్ని ముఖ్యమంత్రి జగన్ ప్రస్తావించారు. 'మీ రేపటి కోసం.. మా ఈ రోజును త్యాగం చేస్తున్నాం' అనే నినాదాన్ని కార్యక్రమంలో ప్రస్తావించారు.

ఇదీ చదవండి:

విశ్రాంత మేజర్ జనరల్‌ వేణుగోపాల్​కు సీఎం జగన్ సన్మానం

ABOUT THE AUTHOR

...view details