Satyasodhana సత్యశోధన పుస్తకావిష్కరణ: అహింసా మార్గంలో సత్యం, ధర్మాన్ని పాటిస్తూ స్వతంత్రం, హక్కుల కోసం ఉద్యమాన్ని నిర్వహించిన వ్యక్తి గాంధీజీ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ పేర్కొన్నారు. సామాన్యుడి నుంచి మహాత్ముడిగా ఆయన పరిణామం చెందిన విధానం సత్యశోధన పుస్తకంలో ఉందన్నారు. గాంధీజీ వారసులుగా మనందరం గర్వించాలన్నారు. గాంధీజీ రాసిన సత్యశోధన (తెలుగు అనువాదం) పునర్ముద్రిత ప్రతిని శుక్రవారం తిరుపతిలో జస్టిస్ ఎన్.వి.రమణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రతి రాజకీయ నేత చదవాల్సిన మొదటి పుస్తకం ఇదే. చరిత్ర, ఆత్మకథలు చాలావరకు అతిశయోక్తులతో, సత్యదూరంగా ఉంటాయి. గాంధీజీ మాత్రం ఉన్నది ఉన్నట్లుగా రాశారు. ఈ పుస్తకాన్ని తిరిగి ప్రచురించడం ఎంతో సంతోషం. ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి క్రియాశీల రాజకీయాల్లో ఉన్నా ముందుకొచ్చి ఈ పుస్తకాన్ని ప్రచురించారు. గాంధీ గురించి తెలియని భారతీయుడు ఉండరు. ఆయన స్వతంత్రం తేవడమే కాదు.. సమాజంలో అహింస, శాంతి మార్గాల ద్వారా నిజాయతీగా జీవితాన్ని గడపడం ఎలా అనేది బోధించారు. ప్రపంచవ్యాప్తంగా అనేక ఉద్యమాలు, పోరాటాలు జరిగినా అవన్నీ హింసాత్మక వాతావరణంలో చోటుచేసుకున్నాయి. ఎటువంటి రక్తపాతం లేకుండా గాంధీజీ అహింస అనే ఆయుధంతో సాగించిన ఉద్యమం భారతదేశ స్వతంత్ర సంగ్రామం. హింస, ద్వేషం, మత కలహాలు లేకుండా ప్రశాంత జీవితాన్ని గడపాలనే గాంధీ శాంతి సందేశం సమాజానికి ఎంతో అవసరం. ఈనాటి యువతరం ప్రత్యేకించి మన జీవన విధానంలో వచ్చిన మార్పులు, బతుకుతెరువు కోసం సాగించే విద్యా విధానంలో గాంధీ గురించి మర్చిపోయే పరిస్థితి వచ్చింది. మళ్లీ ఒకసారి ఆ మహాత్ముడి గురించి ఆలోచించాలన్న స్ఫూర్తిని ఈ పుస్తకం ద్వారా కలగజేశారు. గాంధీకి సంబంధించిన అనేక ఇతర రచనలను సైతం ప్రచురించే బాధ్యతలు కరుణాకర్‌రెడ్డి చేపడతారని ఆశిస్తున్నా’ అని అన్నారు.
ఆయన్ను సరిగ్గా ఉపయోగించుకోలేదు..
CJI Justice NV Ramana: ‘ప్రస్తుత రాజకీయాల్లో నిజం చెప్పడం కష్టమైంది. చేసిన తప్పును ఒప్పుకోవడానికి చాలా ధైర్యం కావాలి. కరుణాకర్‌రెడ్డి తాను చేసిన తప్పును ఒప్పుకొన్నాడంటే ఆయన్ను ఏ విధంగా చూడాలో, గౌరవించాలో చెప్పడానికి మాటల్లేవు. ఎంతో గొప్ప మనస్సుతో.. పరివర్తన చెందిన మానవతావాదిగా కరుణాకర్‌రెడ్డి రుజువు చేసుకున్నారు. విద్యార్థి దశలోనే వామపక్షాల వైపు మళ్లారు. నేను కూడా అంత స్థాయిలో కాకున్నా రాజకీయభావాల పట్ల ఆకర్షితుణ్నయ్యాను. కరుణాకర్‌రెడ్డి ఎమర్జెన్సీలో రెండేళ్లు జైల్లో ఉన్న అతి పిన్న వయస్కుడు. అనేకమంది రాజకీయ నేతలు, సాహితీవేత్తలు, గౌతు లచ్చన్న వంటి దిగ్గజాల సాన్నిహిత్యంతో ఆయనలో మార్పు వచ్చింది. ఆయన ఈ రాజకీయాల్లో ఎలా మనుగడ సాగిస్తున్నారో అని నాకు ఆశ్చర్యం వేసేది. 2011లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. నేను న్యాయమూర్తిగా ఉన్నా. కరుణాకర్‌రెడ్డి ఒకరోజు నా దగ్గరకొచ్చి తిరుపతి పట్టణంలో ఏ వీధి చూసినా మద్యం దుకాణాలు ఎక్కువయ్యాయని ఆవేదన చెందారు. నేనేం చేయాలో అర్థంకావడం లేదని ఓ పిల్ వేశారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ సభ్యుడైనా ఆశయ సాధన కోసం పనిచేసిన ధైర్యశాలి. ఈరోజు ఆయన అధికార పార్టీ సభ్యుడైనా నిర్మొహమాటంగా తన అభిప్రాయాలు చెప్పడం సామాన్య విషయం కాదు. దురదృష్టవశాత్తు ఇవాళ ఉన్న రాజకీయ పార్టీ కానీ అంతకుముందు ఉన్న పార్టీ కానీ ఆయన్ను సరిగ్గా ఉపయోగించుకోలేదనేది నా అభిప్రాయం. విశాల దృక్పథంతో పార్టీ, రాజకీయాలకు అతీతంగా తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పగలిగే మంచి లక్షణాలు ఉన్న నేతను ఈ రాజకీయ పార్టీలు ఉన్నత స్థానంలో ఎందుకు ఉంచవో నాకు అర్థం కాలేదు. ముక్కుసూటిగా మాట్లాడటం, నిర్మొహమాటంగా ఉండటం వంటి విషయాలు నచ్చవేమో! ప్రజల కోసం కరుణాకర్‌రెడ్డి సేవలు వినియోగించుకుంటారని అనుకుంటున్నా. తద్వారా ప్రత్యేకించి తెలుగు ప్రజలకు మేలు చేసిన వారవుతారు. ఆయన నా దగ్గరకొచ్చిన ప్రతి సందర్భంలో భాష, సాహిత్యం, దేశంలోని సమస్యలు, వాటి పరిష్కారం గురించి చర్చించేవారు. కొన్ని సందర్భాల్లో నాపై ఎవరైనా దుష్ప్రచారం చేయించేందుకు ప్రయత్నించినా, విమర్శించినా ఆయన సహించేవారు కాదు. దాని మూలంగా ఆయనకు వచ్చే అవకాశాలు పోతాయి, కొంతమందికి శత్రువు అవుతాడని తెలిసీ నిర్మొహమాటంగా వెల్లడించి నా తరఫున నిలబడిన వ్యక్తి. సొంత సోదరుడి కన్నా ఎక్కువ. రాజకీయాలు అంటే అసహ్యించుకునే పరిస్థితి నుంచి.. మంచి రాజకీయాల వైపు మళ్లించే ఉద్యమానికి కరుణాకర్‌రెడ్డే నాయకుడు కావాలి’ అని జస్టిస్ ఎన్.వి.రమణ అభిప్రాయపడ్డారు.