Justice NV Ramana: ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ ఆడిటోరియంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.. ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వచ్చే సంవత్సరం మే 28 వరకు ఏడాది పాటు ఈ ఉత్సవాలను నిర్వహించనున్నట్లు.. ఎన్టీఆర్ కుమార్తె, భాజపా నేత పురందేశ్వరి తెలిపారు. 12 నెలలపాటు 12 ప్రాంతాల్లో 12 రంగాలను ప్రతిబింబించే రీతిలో ఉత్సవాలను జరపుతామని వెల్లడించారు. అవధాన ప్రక్రియ ద్వారా తిరుపతిలో తొలి వేడుక నిర్వహిస్తున్నట్లు.. పురందేశ్వరి వివరించారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవ సమితి, నందనం అకాడమీ సంయుక్తంగా చేపట్టిన ఈ వేడుకల్లో పంచ సహస్ర అవధాని మేడసాని మోహన్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వివిధ రంగాల్లో విశిష్ఠ సేవలు అందించిన 18 మందిని సత్కరించారు. పంచ సహస్ర అవధాని మేడసానమి మోహన్ అవధాన ప్రక్రియ నిర్వహించారు. సీజేఐ తొలి ప్రశ్న వేసి అవధాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఎన్టీఆర్ మనిషిగా తనపై ముద్రపడటాన్ని గర్వంగా భావిస్తానని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఎన్టీఆర్ రాజకీయపార్టీ పెట్టిన తొలినాళ్లలో ఆయనతో కలిసి పనిచేసే అవకాశం దక్కిందని గుర్తుచేసుకున్నారు. ఆయనతో తనకున్న అనుబంధాలను వివరిస్తూ ఓ పుస్తకం రాస్తానని జస్టిస్ ఎన్వీ రమణ ప్రకటించారు. తెలుగు భాష, సంస్కృతి కోసం పోరాడిన ఎన్టీఆర్‌కు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గౌరవం లభించేలా అందరూ పోరాడాలని సీజేఐ పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా అందరూ కలిసి దీని కోసం కృషి చేయాలని సూచించారు.