హలో బాగున్నారా..! ఆరోగ్యం ఎలా ఉంది.. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న కొవిడ్ కిట్లు అందాయా... అంటూ కరోనా బాధితులను వైద్యులు అరా తీశారు. తిరుపతి శిల్పారామం (అర్బన్ హాట్) కేంద్రంగా చికిత్స పొందుతున్న కరోనా బాధితులతో ఫోన్లో సంభాషించారు. జిల్లా కలెక్టర్ సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు జేసి వీరబ్రహ్మం తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కరోనా బాధితులతో డాక్టర్లు మాట్లాడుతున్నారని చెప్పారు.
హోం ఐసోలేషన్ బాధితులకు మెరుగైన వైద్యం అందేలా సమన్వయ కమిటీ నేతృత్వంలో అన్ని చర్యలు చేపట్టామన్నారు. మధుమేహం, రక్తపోటు వంటి ఇతరత్ర అనారోగ్యాలు ఉన్నాయా, పల్స్ రేట్ ఎంత ఉంది, అత్యవసర పరిస్థితుల్లో ఏ విధంగా అప్రమత్తంగా ఉంటున్నారు, ఎటువంటి ఆహారం తీసుకుంటున్నారనే అంశాలపై వైద్యులు సంభాషించి సమాచారం సేకరిస్తున్నారని తెలిపారు. తిరుపతి, చంద్రగిరి పరిధిలో దాదాపు 3 వేల 645 మంది హోం ఐసోలేషన్ బాధితులు ఉన్నారని... వీరందరికీ వైద్యులు ఫోన్ చేస్తున్నారని వీర్రబ్రహ్మం వెల్లడించారు.