రాష్ట్రంలో అవినీతి, ధరలు తగ్గాలంటే తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో తెదేపా విజయం సాధించాలని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. నెల్లూరు జిల్లాలో ప్రచారానికి బయలుదేరే ముందు శ్రీకాళహస్తిలోని తెదేపా కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఐదు సంవత్సరాలు రాత్రింబవళ్ళు శ్రమించి రాష్ట్ర అభివృద్ధి చేస్తే.. ఒక్క ఛాన్స్ పేరుతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చినా.. వైకాపా రాష్ట్ర ప్రజలపై పిడుగులు కురిపిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు.
ప్రతి కార్యకర్త కొదమ సింహంలా పని చేయాలని సూచించారు. వైకాపా అవినీతి అక్రమాలపై పోరాటం చేస్తూ.. పనిచేస్తున్న నేతలను గుర్తుంచుకొని సత్కరిస్తానని హామీ ఇచ్చారు. పరిషత్ ఎన్నికల బరిలో తెదేపా లేనప్పటికీ వైకాపా రిగ్గింగ్‌కు పాల్పడిందని ధ్వజమెత్తారు. ఈ ధర్మపోరాటంలో తెదేపా కార్యకర్తలే తన సైన్యమని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అవినీతి అక్రమాలు మితిమీరాయని విమర్శించారు. పరిశ్రమలు, ఇసుక చివరకు శ్రీకాళహస్తీశ్వరాలయంలో కూడా వైకాపా నేతలు అవినీతికి పాల్పడుతున్నారని పేర్కొన్నారు.