ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

call routing: ‘కాల్‌ రూటింగ్‌’తో హైటెక్‌ దందా.. ముఠా గుట్టురట్టు..

‘కాల్‌ రూటింగ్‌’తో హైటెక్‌ దందాకు పాల్పడుతున్న ముఠా గుట్టును తిరుపతిలోని అలిపిరి పోలీసులు రట్టు చేశారు. ముఠాలోని ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్​ చేశారు. బుధవారం ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకోగా.. గురువారం మరో ముగ్గుర్ని అరెస్ట్​ చేశారు. తిరుపతి లీలామహల్ కూడలిలోని మొబైల్ టవర్ల నుంచి అనుమానాస్పద మొబైల్ ఫోన్ నెంబర్లు పనిచేస్తున్నట్లు.. బీఎస్​ఎన్​ఎల్(BSNL) కమ్యూనికేషన్స్​ డైరక్టర్ మనోజ్ కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

call routing scam
call routing scam

By

Published : Jul 29, 2021, 4:17 PM IST

Updated : Jul 29, 2021, 6:46 PM IST

‘కాల్‌ రూటింగ్‌’తో హైటెక్‌ దందా.. ముఠా గుట్టురట్టు..

అంతర్జాతీయ ఫోన్ కాల్స్(international phone calls) ను.. స్థానిక కాల్స్(local phone calls)​గా దుర్వినియోగం చేస్తున్న ముఠాలోని మరో ముగ్గురు వ్యక్తులను తిరుపతిలోని అలిపిరి పోలీసులు అరెస్ట్​ చేశారు. కంప్యూటర్, ల్యాప్‌టాప్‌, 4 టెలికామ్ గేట్ వేలు, 116 సిమ్‌లు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఈ ముఠాలోని ముగ్గురిని పోలీసులు అరెస్ట్​ చేశారు. మొత్తం ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వాయిస్ ఓవర్ ఇంటర్నెట్‌ ద్వారా లోకల్ కాల్స్‌గా మారుస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వెయ్యి సిమ్ కార్డులతో మోసానికి పాల్పడినట్లు విచారణలో తేలింది. అరబ్ దేశాల నుంచి ఎక్కువ ఫోన్‌కాల్స్ వచ్చినట్లు తెలిసింది. ఉగ్రవాదులతో సంబంధాలపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

స్థానికుల సహకారంతో ..

విదేశాలకు చెందిన కొందరు భారతదేశంలో కొన్ని ముఠాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో భాగంగా బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి తిరుపతిలో స్థానికుల సహకారంతో అక్రమంగా అత్యాధునిక టెలికామ్‌ సెటప్‌ ఏర్పాటు చేశాడు. విదేశాల నుంచి వచ్చే ఫోన్‌కాల్స్‌ను వాయిస్‌ ఓవర్‌ ఇంటర్‌నెట్‌ ప్రొటోకాల్‌(వీఓఐపీ) పద్ధతి ద్వారా లోకల్‌ కాల్స్‌గా మార్చుతున్నారు. వీటిని కొన్ని సిమ్‌కార్డుల ద్వారా సంబంధిత వ్యక్తులకు మళ్లిస్తున్నారు. విదేశాల్లోనూ ఇలాంటి విధానాన్నే అనుసరిస్తున్నారు. ఈ నంబర్ల నుంచి కేవలం అవుట్‌ గోయింగ్‌ కాల్స్‌ వెళుతున్నాయన్న అనుమానం ఆయా ఆపరేటర్లకు రాకుండా ఉండేలా.. నిందితులు రోజూ సిమ్‌కార్డులను మార్చుతున్నారు. ఫలితంగా ఆయా దేశాల్లోని ఆపరేటర్లకు గేట్‌వే ఆఫ్‌ ఐఎల్‌డీ(ఇంటర్నేషనల్‌ లాంగ్‌ డిస్టన్స్‌) చేరకుండా వీరు సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వాలకు చేరాల్సిన పన్ను కూడా అందకుండా పోతోంది. ఇలా చేయడం దేశ భద్రతకు ముప్పుగా కేంద్రం పరిగణిస్తోంది. విదేశీ శక్తులతో సంబంధం ఉన్న వ్యక్తి స్థానిక ముఠాలకు అనుసంధానిగా ఉంటాడు. కాల్స్‌ ద్వారా వచ్చే ఆదాయాన్ని విదేశీ శక్తులు ఆ వ్యక్తికి పంపితే.. అతను ముఠా సభ్యులకు చేరవేస్తాడు.

తిరుపతి లీలామహల్ కూడలిలోని మొబైల్ టవర్ల నుంచి అనుమానాస్పద మొబైల్ ఫోన్ నెంబర్లు పనిచేస్తున్నట్లు.. బీఎస్​ఎన్​ఎల్(BSNL) కమ్యూనికేషన్స్​ డైరక్టర్ మనోజ్ కుమార్ ఫిర్యాదు చేశారు. అంతర్జాతీయ కాల్స్​ను స్థానిక కాల్స్ గా మార్చి సొమ్ము చేసుకుంటున్నారని.. దీంతో జాతీయ భద్రతకు ముప్పు ఏర్పడుతోందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏడాదిగా ఇలాంటి కార్యకలాపాలు సాగించడం వల్ల.. పెద్దస్థాయిలో దోపిడీ జరిగినట్లు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. హైటెక్‌ ‘కాల్‌ రూటింగ్‌’ దందాపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: Arrest: అంతర్జాతీయ ఫోన్ కాల్ ముఠా అరెస్టు

Last Updated : Jul 29, 2021, 6:46 PM IST

ABOUT THE AUTHOR

...view details