తిరుపతి గోవిందరాజస్వామివారి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. ధ్వజారోహణ కార్యక్రమాన్ని వేదపండితులు నేత్రపర్వంగా నిర్వహించారు. ఉదయం 7.55 నుంచి 8.30 గంటల మధ్య మిథున లగ్నంలో శాస్త్రోక్తంగా కార్యక్రమాన్ని జరిపారు. పండితుల వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు నడుమ గరుడ చిత్రంతో కూడిన ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించారు. ఆనంతరం శ్రీవారి ఆస్థానం జరిగింది. అంతకుముందు అర్చకులు విష్వక్సేన ఆరాధన, వాస్తుహోమం, గరుడ లింగహోమం, గరుడ ప్రతిష్ఠ, రక్షా బంధనం చేపట్టారు.
నేటి నుంచి 9 రోజుల పాటు స్వామివారికి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ రోజు సాయంత్రం స్వామివారిని పెద్ద శేషవాహనంపై విహరింపజేస్తారు. కరోనా కారణంగా బ్రహ్మోత్సవాలను ఆలయంలో ఏకాంతంగానే నిర్వహిస్తున్నారు.