తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట బాలుడి కిడ్నాప్ కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. కిడ్నాప్‌కు గురైన 24 గంటల తర్వాత బాలుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు క్లిష్టంగా మారింది. ఆదివారం ఉదయం బాలుడు కిడ్నాప్‌నకు గురవగా సోమవారం ఉదయం బాలుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలుడి తల్లి స్వాతి తిరుమలలో వీధుల్లో తిరుగుతూ చిన్నపాటి వస్తువులను విక్రయించడంతో పాటు తిరునామాలు పెడుతూ జీవనం సాగిస్తూ ఉండేది. ఎప్పటిలాగే ఆదివారం కుమారుడిని అఖిలాండం వద్ద వదిలి పరిసర ప్రాంతాల్లో పనులు చేసుకుంటోంది. కాసేపటి తర్వాత బాలుడు కనిపించకపోయేసరికి పరిసర ప్రాంతాల్లో గాలించింది. ఆచూకీ లేకపోవడంతో తితిదే కమాండ్ కంట్రోల్ కేంద్ర సిబ్బంది దృష్టికి తీసుకెళ్లింది. సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించిన సిబ్బంది.. ఓ మహిళ బాలుడిని తీసుకెళుతున్నట్లు గుర్తించారు. ఆమె కోసం తిరుమలలో గాలించిన బాలుడి తల్లి స్వాతి.. మహిళ, బాబు ఆచూకీ తెలియకపోవడంతో సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తిరుమలలో బాలుడి కిడ్నాప్.. పోలీసుల దర్యాప్తు ముమ్మరం
Boy Kidnaped in Tirumala: తిరుమలలో బాలుడి కిడ్నాప్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఆదివారం ఉదయం తిరుమలలో బాలుడిని అపహరించిన మహిళ సోమవారం ఉదయం తిరుపతి రైల్వేస్టేషన్‌లో రైలు ఎక్కినట్లు పోలీసులు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించగా.. బాలుడితో కలిసి మహిళ గోవిందరాజస్వామి ఆలయంలో సంచరించిన దృశ్యాలు కనిపించాయి. రైల్వేస్టేషన్‌లో టికెట్ కౌంటర్ వద్ద కెమెరాలు పనిచేయకపోవడంతో దర్యాప్తు ముందుకు సాగడం లేదు.
బాలుడి తల్లి స్వాతి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసిన తిరుమల పోలీసులు.. ఆలయం సమీపంతో పాటు బస్టాండ్ ఇతర ప్రాంతాల సీసీ కెమెరాల దృశ్యాలను మరింత నిశితంగా పరిశీలించారు. బాలుడిని కిడ్నాప్ చేసిన మహిళ ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో తిరుమలలో బస్సు ఎక్కి 7 గంటల ప్రాంతంలో తిరుపతి చేరుకున్నట్లు గుర్తించారు. 8 గంటల సమయంలో తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలోకి ప్రవేశించి దర్శనం అనంతరం బయటకు వచ్చినట్లు సీసీకెమెరాల్లో రికార్డైంది. తిరిగి సోమవారం ఉదయం నాలుగు గంటల సమయంలో తిరుపతి రైల్వేస్టేషన్‌లోకి వెళుతున్న దృశ్యాలను పోలీసులు గుర్తించారు.
సోమవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో రైల్వేస్టేషన్‌లోకి ప్రవేశించిన మహిళ టికెట్ కౌంటర్ వద్దకు వెళ్లి టికెట్ తీసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. టికెట్ కౌంటర్ వద్ద సీసీ కెమెరాలు పనిచేయకపోవడం పోలీసుల దర్యాప్తునకు అడ్డంకిగా మారింది. నాలున్నర గంటల సమయంలో తిరుపతి స్టేషన్ నుంచి బయలుదేరే రైళ్లు, అవి వెళ్లే ప్రాంతాలను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
ఇదీ చదవండి:Kidnap: తిరుమలలో ఐదేళ్ల బాలుడి కిడ్నాప్