ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తిరుపతి బైపోల్: భాజపా సరికొత్త వ్యూహం.. క్షేత్రస్థాయిలోకి వెళ్లటమే లక్ష్యం! - Bjp election strategy for tirupati by poll 2021

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో.. ప్రచారంలో పార్టీలన్నీ వ్యూహా, ప్రతివ్యూహాలకు పదును పెడుతున్నాయి. జనసేన మద్దతుతో రాష్ట్రంలో పాగా వేద్దామనుకుంటున్న భారతీయ జనతాపార్టీ ఉత్తరాదిలో విజయవంతమైన తమ ఫార్మూలాను దక్షిణాదిలోనూ ప్రవేశపెట్టేందుకు పథక రచన చేస్తోంది. ప్రభుత్వం ఎన్నికల కోసం వాలంటీర్ వ్యవస్థను వాడుకుంటుందటూ విమర్శలు చేస్తూ వస్తున్న భాజపా.. దీనికి దీటుగా పేజ్ ప్రముఖ్ వ్యూహాన్ని అమలు చేయబోతోంది.

tirupati by poll 2021
tirupati by election

By

Published : Apr 1, 2021, 5:10 AM IST

రాష్ట్రంలో ప్రతీ 50ఇళ్లకు ప్రభుత్వ సేవలను అందేలా అధికార వైకాపా.. వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు.. వాలంటీర్‌ వ్యవస్థను వైకాపా వాడుకుంటోందంటున్న భాజపా.. దీనికి దీటైన వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. ప్రతీ 10 ఇళ్లను సమన్వయం చేసుకునేలా ఉత్తరాదిలో అమలు చేసి విజయం సాధించిన పేజ్ ప్రముఖ్ వ్యవస్థను.. తిరుపతి ఉపఎన్నికలో వినియోగించబోతోంది.

క్షేత్రస్థాయి నుంచి....

సాధారణంగా లోక్ సభ ఎన్నికను.. నియోజకవర్గం, వార్డులు లేదా డివిజన్లు, పోలింగ్ బూత్ లు ఇలా విభజించుకుని పార్టీలన్నీ ఎన్నికలకు సిద్ధమవుతాయి . కానీ పేజ్ ప్రముఖ్ వ్యవస్థ.. మరింత క్షేత్రస్థాయి నుంచి పని చేస్తుంది. ప్రచారంలో అన్ని ప్రాంతాలను కవర్ చేయలేని పరిస్థితులు ఉంటాయి. ఇలాంటి ఇబ్బందులను అధిగమించేందుకు క్షేత్రస్థాయి సమన్వయం కోసం.. పేజ్ ప్రముఖ్ వ్యవస్థను భాజపా రూపొందించింది. పోలింగ్‌బూత్‌లో ప్రతీ పేజ్‌కు పార్టీకి అనుకూలంగా ఉండే వ్యక్తిని గుర్తిస్తారు. ఇతడే పేజ్ ప్రముఖ్. వారికి పార్టీ విధివిధానాలు, మ్యానిఫెస్టో, చేసిన అభివృద్ధి, చేస్తామని చెబుతున్న హామీలు ఇలా ప్రతీ అంశంలోనూ.. ఆ పేజ్ ప్రముఖ్‌కు శిక్షణ ఇస్తారు. వారికి ఆ పేజ్‌లోని మిగిలిన ఓటర్లను పార్టీకి అనుకూలంగా మార్చి ఓటు వేయించేలా బాధ్యత అప్పగిస్తారు. అలా ఒక్క పోలింగ్ బూత్ కే సుమారు 10-15మంది పేజ్ ప్రముఖ్ లను ఏర్పాటు చేసుకుని వ్యూహాన్ని అమలు చేస్తారు. ఈ వ్యూహం ద్వారానే ఉత్తరాది రాష్ట్రాల్లో విజయవంతమైన కమళదళం..ఇప్పుడు మన రాష్ట్రంలోనూ ప్రవేశపెట్టాలని ప్రణాళికలు రచిస్తోంది.

పక్కా ప్రణాళికతో...

తిరుపతి పార్లమెంట్ పరిధిలో విజయం కోసం భాజపా ముఖ్యంగా నాలుగు వ్యూహాల్ని అమలు చేస్తోంది. ఒకటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేకంగా తిరుపతి లోక్ సభ స్థానానికి చేసిన పనులను వివరించటం.. రెండు, ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను తిప్పేకొట్టేలా వాస్తవాలను ప్రచారం చేయటం. ఇందుకోసం ఇప్పటికే పెద్దఎత్తున డిజిటల్ ప్రచారం చేపట్టింది. ట్విట్టర్, ఫేస్ బుక్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా #మోదీ4తిరుపతి అనే సోషల్ మీడియా క్యాంపైన్‌ను నడుపుతోంది. మరోవైపు 2వేల పైచిలుకు ఉన్న పోలింగ్ బూత్ లను..ఐదేసి పోలింగ్ బూత్‌లుగా విడదీసి.. ఓ రాష్ట్రస్థాయి నాయకుడిని ఇన్‌ఛార్జిగా నియమిస్తోంది. వీరు పోలింగ్‌బూత్‌ పరిధిలోని పేజ్ ప్రముఖ్‌ల ద్వారా ఓటర్లను ప్రభావితం వ్యూహ రచన చేస్తున్నారు. అట్టడుగు క్షేత్రస్థాయికి కేంద్రం చేస్తున్న అభివృద్ధి తీసుకువెళ్లి విజయవంతం అవుతామని భాజపా నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

పేజ్ ప్రముఖ్ వ్యవస్థ ద్వారా ప్రజల్లోకి వెళ్లటంతోపాటు.. పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేన కార్యకర్తలు.. తిరుపతి ఉపఎన్నికలో అదనపు బలం అవుతారని భాజపా రాష్ట్ర నాయకత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

ఇదీ చదవండి

విరసం నేతల ఇళ్లలో ఎన్​ఐఏ సోదాలు

ABOUT THE AUTHOR

...view details