రాష్ట్రంలో హిందూధర్మంపై దాడి జరుగుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. విజయవాడలో గోవుల మృతి, శ్రీశైలంలో అన్యమతస్తులకు వ్యాపారాలు, ఇప్పుడు తిరుమలలో టికెట్ల వెనక ఇతర మతాల ప్రచారమే దీనికి ఉదాహరణ అని వ్యాఖ్యానించారు. వీటిపై ప్రభుత్వానికి సమాచారం లేదా.. తెలిసే జరుగుతోందా అని నిలదీశారు. ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడటం సరికాదని... దేశంలో అందరి మనోభావాలను గౌరవించాలని హితవు పలికారు.
తిరుమలలో ఆర్టీసీ బస్సు టిక్కెట్లపై అన్యమత ప్రచారంపై... తిరుపతి ఆర్టీసీ ఆర్‌ఎంకు భాజపా నేతలు వినతిపత్రం ఇచ్చారు. బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని ఆరోపించారు. అన్యమత ప్రచారాన్ని ఆపకపోతే ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని హెచ్చరించారు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ వద్ద భాజపా కార్యకర్తలు ఆందోళన చేశారు. ఆర్టీసీ టిక్కెట్లపై అన్యమత ప్రకటనలపై నిరసన వ్యక్తం చేశారు.
తిరుమలలో అన్యమత ప్రచారంపై రాష్ట్ర భాజపా వ్యవహారాల ఇన్‌ఛార్జ్ సునీల్ దేవధర్ స్పందించారు. బస్ టికెట్లపై జెరూసలేం యాత్ర గురించి ముద్రించడం సరికాదని హితవు పలికారు. ఇలాంటి చర్యలు తిరుమల శ్రీవారిని అవమానించడమేనని పేర్కొన్నారు. రావాలి ఏసు.. కావాలి ఏసు.. వైకాపా కొత్త నినాదమా? అని సునీల్ దేవధర్ ప్రశ్నించారు.
మంత్రుల స్పందన...
తిరుమల అన్యమత ప్రచార ఉదంతంపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించారు. తిరుపతి నుంచి తిరుమల వెళ్లే బస్సు టికెట్లపై అన్యమత ప్రచారం చేశారంటూ... జరుగుతున్న వ్యవహారం ప్రభుత్వం దృష్టికి వచ్చిన వెంటనే విచారణకు ఆదేశించామన్నారు. ఆ టికెట్లు గత తెదేపా ప్రభుత్వ హయాంలో ముద్రించినట్లుగా తేలిందని చెప్పారు. నెల్లూరు డిపోలో ఉండాల్సిన టికెట్లు నిబంధనలకు విరుద్ధంగా తిరుపతి డిపోకు వెళ్లినట్లుగా గుర్తించామన్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వివరించారు.