370 ఆర్టికల్ రద్దు విజయోత్సవ సభను తిరుపతిలో నిర్వహించారు.. భాజపా నేతలు. తిరుపతి శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయ ఆడిటోరియం వేదికగా నిర్వహించిన ఈ సభకు రామ్ మాధవ్ తో పాటు.. రాష్ట్ర భాజపా నేతలు హాజరయ్యారు. జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి ఇన్నాళ్లూ ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370ని.. 70 ఏళ్ల రాచపుండుగా రామ్ మాధవ్ చెప్పారు. ఈ సమస్యను.. డెబ్బై రోజుల్లోనే మోదీ ప్రభుత్వం సర్జరీ చెరసి తొలగించిందన్నారు.
''ఆర్టికల్ 370 రాచపుండు.. మోదీ శస్త్ర చికిత్స చేసి తొలగించారు''
రాజ్యాంగంలోని అధికరణం 370ని 70 ఏళ్ల రాచపుండుగా అభివర్ణించారు.. భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్. మోదీ ప్రభుత్వం శస్త్ర చికిత్స చేసి ఆ రాచపుండును తొలగించిందని తిరుపతి సభలో వ్యాఖ్యానించారు.
''370 తొలగిస్తే రక్తపాతం జరుగుతుందని చెప్పిన నాయకులకు దాని గురించి తెలియదు. మోదీ నిర్ణయం సరైనదని దేశ ప్రజలు జేజేలు పలుకుతున్నారు. 370 అధికరణ తొలగించి ఇరవై రోజులు గడచినా కశ్మీర్ లోయలో ఎలాంటి అలజడి లేదు. భారత సమైక్యతకు మోదీ తీసుకున్న నిర్ణయం అది. 370 అధికరణం ద్వారా కశ్మీర్‌కు కలిగే ప్రయోజనం ఏమీ లేదు కాబట్టే తొలగించిన తర్వాతా ప్రశాంత ఉంది. కశ్మీర్ నేతలకే తప్ప.. ప్రజలకు 370 అధికరణం ద్వారా ఎలాంటి ప్రయోజనం లేదు. భారత రాజ్యాంగం ప్రకారం గ్రామపంచాయతీలకు కేంద్రం నేరుగా నిదులిస్తుంది. కశ్మీర్ లో 370 అధికరణం ద్వారా అది ఇన్నాళ్లూ వర్తించలేదు. ఇప్పుడు మాత్రం ఆ సమస్య లేదు. ఇకపై జమ్మూకశ్మీర్ వేగంగా అభివృద్ధి చెందుతుంది'' అని.. రామ్ మాధవ్ చెప్పారు.