తిరుపతి ఉపఎన్నికలో భాజపా అభివృద్ధి, పవన్ కల్యాణ్ ప్రజాదరణ అస్త్రంగా తమ పార్టీ విజయం సాధిస్తుందని భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ తిరుపతిలో అన్నారు. తిరుపతి లోక్సభ ఉపఎన్నికలపై చర్చించేందుకు భాజపా, జనసేన నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఉపఎన్నికలో జనసేన, భాజపా ఉమ్మడి అభ్యర్థి బరిలో ఉంటారని తెలిపారు. రాష్ట్రంలో భాజపా అధికారంలో లేకపోయినా తిరుపతి అభివృద్ధికి కేంద్రప్రభుత్వం కోట్ల రూపాయల నిధులు కేటాయించిందని తెలిపారు.
తిరుపతి పవిత్రత కాపాడేందుకు... ప్రపంచంలో ప్రముఖ నగరంగా తిరుపతిని అభివృద్ధి చేసేందుకు భాజపాకు ఓటేసి ప్రధాని నరేంద్రమోదీకి తిరుపతి స్థానాన్ని కానుకగా ఇవ్వాలని ఆయన ప్రజలను విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాల పాటు పనిచేసిన చంద్రబాబు సొంత జిల్లాకు చేసింది ఏమీ లేదని సత్యకుమార్ విమర్శించారు. గడిచిన ఆరున్నర సంవత్సరాలుగా వైకాపా నుంచి గెలుపొందిన తిరుపతి ఎంపీలు ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. ఉపఎన్నికలో ఓటు వేయమని కోరే హక్కు భాజపా, జనసేనకు మాత్రమే ఉందన్నారు.