ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

బర్డ్ ఫ్లూ అలెర్ట్​.. తిరుపతిలో అధికారుల జాగ్రత్తలు

దేశంలోని వివిధ రాష్ట్రాల్లో బర్డ్‌ ఫ్లూ విజృంభిస్తున్న నేపథ్యంలో జంతు ప్రదర్శనశాలలపై దాని ప్రభావం పడకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు ముందస్తు చర్యలకు అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. పశు వైద్య నిపుణులతో కలిసి పక్షుల సంరక్షణ చర్యలకు ఉపక్రమించారు.

By

Published : Jan 12, 2021, 3:33 PM IST

బర్డ్ ఫ్లూ అలెర్ట్​.. తిరుపతిలో అధికారుల చర్యలు
బర్డ్ ఫ్లూ అలెర్ట్​.. తిరుపతిలో అధికారుల చర్యలు

హరియాణ, మధ్య ప్రదేశ్‌, కేరళ, మహారాష్ట్ర, జమ్మూ కశ్మీర్​లో బర్డ్ ఫ్లూ విస్తరిస్తున్న నేపథ్యంలో జంతు ప్రదర్శన శాల అధికారులు అప్రమత్తమయ్యారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాలలో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. తిరుపతి జూలో అడవి కోళ్లు, నీటి పక్షులు, దేశ, విదేశీ జాతులకు చెందిన చిలుకలు, ఈము పక్షులు ఉన్నాయి. బూడిదరంగు అడవికోళ్ల పునరుత్పత్తి కేంద్రంలో సుమారు 40 కోళ్లు ఉన్నాయి. పక్షుల ప్రదర్శనశాలలో అన్ని రకాల జాతులకు చెందిన 594 పక్షులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ముందస్తు సంరక్షణ చర్యల్లో భాగంగా ఇటీవలే తిరుపతి పశువైద్య కళాశాల వైద్యులు, పరిశోధకులు జూను సందర్శించారు. అధికారులకు పలు సూచనలు చేశారు.

పక్షుల ఎన్‌క్లోజర్‌ వద్ద వైరస్‌ ప్రబలకుండా చర్యలు చేపట్టారు. ఇనుప కంచెలకు మంటలను వెదజల్లుతూ వైరస్‌ను సంహరించే కార్యక్రమం బ్లో టార్చింగ్‌ చేపట్టారు. పక్షుల ఎన్‌క్లోజర్స్‌ గోడలకు సున్నం వేయడం ద్వారా వైరస్‌ నుంచి పక్షులను కాపాడేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పక్షులు ఉన్న ప్రాంతాల్లో ఇప్పటికే ఉన్న మట్టి, ఇసుకను తొలగించి కొత్త ఇసుక వేస్తున్నారు.

పొటాషియం పర్మాంగనేటు ద్రావణంతో పరిసర ప్రాంతాలను పిచికారీ చేస్తున్నారు. పక్షుల ఆరోగ్యంపై అనుమానం వస్తే వాటిని వేరే ప్రాంతాలకు తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సంరక్షకులు పక్షుల దగ్గరకు వెళ్లినపుడు పీపీఈ కిట్లు, మాస్క్‌, చేతి తొడుగులు ధరించేలా ఆదేశాలు జారీ చేశారు. సందర్శకులు అతి దగ్గరగా వాటిని చూడకుండా దూరంగా ఉండేలా చర్యలు చేపట్టారు. పక్షుల ఎన్‌క్లోజర్‌ల వద్ద బర్డ్‌ ఫ్లూ వివరాలతో బోర్డులు ఏర్పాటు చేసి సందర్శకుల్లో చైతన్యం కలిగిస్తున్నారు అధికారులు.

ఇదీ చదవండి:'రోష్ణీ'.. ఆ విభాగానికే బ్రాండ్​ అంబాసిడర్​గా..

ABOUT THE AUTHOR

...view details