తిరుపతి రుయా (RUYA incident) ఆస్పత్రి ఘటనపై హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. ఆక్సిజన్ రావడంలో జాప్యంతోనే 23 మంది చనిపోయినట్లు అఫిడవిట్‌లో పేర్కొంది. ఆక్సిజన్ సరఫరా కంపెనీపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించినట్లు అఫిడవిట్‌లో తెలిపింది. రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక మృతిచెందిన ఘటనపై విచారణ జరిపి బాధితులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తిరుపతి తెదేపా దివంగత నేత టీఆర్ మోహన్ దాఖలుచేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది.
ఏం జరిగిందంటే..
మే10వ తేదిన తిరుపతి రుయా (RUYA incident) ఆస్పత్రిలో ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ప్రాణవాయువు అందక 23 మంది కరోనా రోగుల మృత్యువాత పడ్డారు. రాత్రి 8 గంటల సమయంలో ఆక్సిజన్ నిల్వ ఉన్న ట్యాంకు ఖాళీ అయింది. వార్డుల్లోని రోగులకు ప్రాణవాయువు సరఫరా ఆగిపోయి, పరిస్థితి ఒక్కసారిగా విషమించింది. బాధితుల సహాయకులు వైద్యులకు సమాచారమిచ్చారు. ఈలోపు ఆస్పత్రి ఆవరణలో ఉన్న బంధువులు తమవారి వద్దకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అప్పటికే రోగులు ఒకొక్కరుగా మరణించసాగారు. రాత్రి 9 గంటల సమయానికి తమిళనాడులోని శ్రీపెరంబదూర్ నుంచి ఆక్సిజన్ ట్యాంకర్ రాకతో సరఫరాను పునరుద్ధరించారు.